Advertisement

ఆవేటి పూర్ణిమ

ఈమె 1918, మార్చి 1న అత్తిలిలో నడియేటి పడవలో సురభి లక్ష్మమ్మ, వనారస గోవిందరావులకు జన్మించారు. ఈ గోవిందరావు ఆంధ్రనాటక కళాపరిషత్తు, సురభి నాటక సంస్ధల స్ధాపించిన వారిలో ఒకరు. ఈమె 15వ ఏటనే ఆవేటి రామయ్య గారిని వివాహమాడారు. తెలుగు టాకీ యుగ ప్రారంభంతో ప్రముఖ నటీమణులు పి.రామతిలకం, కన్నాంబ, ఋష్యేంద్రమణి, శ్రీరంజని వంటినటీమణులు సిని రంగానికి వెళ్ళిన తరుణంలో నాటకరంగంలో స్త్రీ పాత్రధారిణులకు కొరత ఏర్పడింది. ఈ స్థితిలోనే పూర్ణిమ రంగస్థలంమీద అవతరించింది. పుట్టింటివారి శిక్షణలో బాలనటిగా ఈమె నటనా జీవితం మొదలైంది.

వివాహానంతరం 1936లో శ్రీ శారదా మనోవినోదిని పేరిట స్థాపించిన స్వంత నాటక కంపెనీలో నాయిక పాత్రధారిణిగా ఎంతో ప్రజాదరణను చేకూర్చుకొంది. “ఆనాటి ప్రసిద్ధ నటులందరి ప్రక్కన అన్ని నాటకాల్లోనూ ఆవేటి పూర్ణిమ స్త్రీ పాత్రలు ధరించారు. ఈవిడ పౌరాణిక పాత్రలే కాకుండా చారిత్రక పాత్రలు కూడా ధరించారు. 1944లో పూర్ణిమా ఆర్టు థియేటర్సును స్థాపించి స్వీయ సారథ్యంలో ఎన్నో నాటకాలను సమర్ధవంతంగా నిర్వహించి పేరు ప్రఖ్యాతులు పొందారు. సత్యభామ, సక్కుబాయి, సావిత్రి, చిత్రాంగి, ప్రమీల, చంద్రమతి, మల్లమాంబ, కమల వంటి నాయిక పాత్రలు ఆమె నటజీవితంలో మైలురాళ్లుగా నిలిచాయి. తనతో నటిస్తూన్న నటుడు ఏరాగంలో ఏస్ధాయిలో పాడితే అదేరాగంలో అదేస్ధాయిలో తనూపడగలిగిన సమర్ధనటిఈమె. సారంగధర, చిత్రనళినీయం, హరిశ్చంద్ర, తులాభారం, చింతామణి, విప్రనారాయణ, శ్రీకృష్ణలీల, సావిత్రి, పాదుక, ప్రహ్లాద, మండోదరి, ఖిల్జీరాజ్యపతనం, కోకిల ధరణికోట వంటి నాటకాలలో స్త్రీపాత్రలు ధరించేవారు.

1941 మద్రాసులో ఆంధ్రనాటక కళాపరిషత్తువారు నాటకపోటిలు జరిపినప్పుడు గాలి బాలసుందర రావుగారి ‘అపోహ’ నాటకంలో ప్రధాన స్త్రీ పాత్రధరించి ఉత్తమ నటి బహుమతి అందుకున్నారు. 1944లో పూర్ణిమా నాట్యమండలిని స్ధాపించి ఎన్నో నాటక పదర్శనలుఇచ్చారు. నాటి కృష్ణానది వరద బాధితులకోసం తన ప్రదర్శనల ద్వారా విరాళాలు సేకరించి అందజేసారు. సినీరంగంలో ప్రవేశించి సారధీ ప్రొడక్షన్స్ ‘అపవాదు’ (1941) జగదీశ్ ప్రొడక్షన్స్ ‘సత్యభామ’ (1942) చిత్రాలలో ప్రధాన పాత్రలో నటించారు. సినిమాల్లో చివరిగా బాపు గారి ‘అందాలరాముడు’ చిత్రంలో స్టీమర్ లో బామ్మగా నటించారు.

1949లో ఆంధ్రనాటకకళా పరిషత్తులో, జంషెడ్ పూర్ ఆంధ్ర నాటక సాహిత్య సంఘంలోనూ, వెంకటగిరి, పాలకొల్లు, వెంకటాచలం వంటి పలు ప్రాంతాలలో ఘన సన్మానాలు జరిగాయి. 1958లో ఆంధ్రప్రదేశ్ గౌవర్నర్ భీమసేన్ సచార్ వారిద్వారా సువర్ణ ఘంటా కంకణాన్ని అందుకున్నారు. ఒరిస్సా, భీహార్, మహరాష్ట్రా, రంగూన్ వంటి పలు ప్రదేశాలలో ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు అందుకున్నారు. సత్యభామ, సక్కుబాయి, సావిత్రి, చిత్రాంగి, ప్రమిలా, చంద్రమతి, మల్లమాంబ, కమల వంటి నాయకి పాత్రలు ఈమె నట జీవితంలో మైలురాళ్ళుగా నిలచాయి. 30 ఏళ్ళు తెలుగు సినీ, నాటకరంగాలలో ఎనలేని సేవలు అందించిన ఈమె 1995నవంబరు 26న తుదిశ్వాస విడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *