కోవెల కోరని దేవుళ్ళు
బిడ్డల భవితకై కాయాన్ని కష్టానికి అరువుగా పెట్టి
ఎద్దుల్లా కష్టపడతారే ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి.
అలసిన మనసుకి ఊరటగా బిడ్డల మోమును చూసి తెగ సంబర పడిపోతారే ఏమీ ఆశించని ఆ పిచ్చి హృదయాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి.
ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా
ఒంటి చేత్తో వాటిని నెట్టుకోస్తూ
బిడ్డల ఆకలిని తీర్చి, పస్తులు ఉండే మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి…
జీవితంలో, ఎంత గొప్ప స్థానానికి వెళ్లినా తీర్చుకోలేని రుణం అమ్మానాన్నలది, ఏం చేసినా తక్కువే, ఎంత బాగా చూసుకున్నా తక్కువే, ఒక స్థాయికి మనల్ని తీసుకురావడానికి వారు పడిన కష్టానికి మనం మన జీవితాన్ని ధారపోసినా తక్కువే…
వడ్డి సుధాకర్ గారి రచనలు, నిజ జీవిత సంఘటనలను ప్రత్యక్షంగా చూపించడంలో అమోఘమైన పాత్ర పోషిస్తాయి, రాయలసీమ యాసని పునికి పుచ్చుకుని, విప్లవ ఘంటా రావాలను మోగిస్తూ, తనదైన శైలిలో సమాజంలో జరిగే దుర్లభాలకు, అతీతంగా అక్షర సైన్యానికి ప్రశ్నల ఆయుధాలు అందించి, సమాజ మార్పుకై కృషి చేస్తున్న మీకు ముందుగా అభినందనలు తెలుపుతూ..
ఇక కవిత్వం విషయానికి వస్తే
శీర్షిక : ఏమివ్వగలం
భవిష్యత్తు తెలియని పసి హృదయాల్లో
ప్రేమ ఆప్యాయతానురాగాలు
బంధాలు,బంధుత్వ విలువలను నూరిపోస్తూ
బతుకు తెలియని బాల్యంలో బంధాలతో బంధీ చేసి
గొప్ప అనుభూతుల్ని అందించిన అమ్మానాయినలకు ఏమివ్వగలం
పొట్టకూటి కోసం సద్ది కట్టుకుని పోయి
పగలంతా రోకి, ఎండకు మాడిపోయి
తీసుకున్న కూలీని కొంగులో దాచిపెట్టి
మాపటేల ఇంటికొచ్చి పిల్లల్ని ముద్దాడి
సీరకొంగు ముడి నుండి రూపాయి దీసిచ్చిన
మాయమ్మ ప్రేమకు నేనేమివ్వగలను
అమ్మ పూసి ఒళ్లంతా గుల్లలైతే
ఆవురావురంటూ వేపాకుదెచ్చి
ఇల్లిల్లు తిరిగి పంచితం బట్టుకొచ్చి
నా పంచనే కూసోని ,
తొక్కడ కాకుండా తడిచేస్తూ
తన కమ్మని ప్రేమను పంచిన
మాయమ్మ గొప్ప మనసుకు నేనేమివ్వగలను ఈ రాతలతో అమ్మ మనసును భవితకు చూపడం తప్ప…!
కన్న బిడ్డలకి కడుపునిండా కూడెట్టాలని
పొద్దుగాలే పొలగు కట్టుకొని పొలానికి పోయి
మడకదున్ని విత్తువేసి
పసి హృదయాల్ని ఘూటువపై కూర్చోబెట్టి
ఎద్దులతో ఉరకలెత్తించి
ఉన్నంతలో ఉన్నతంగా సంతోషాన్ని అందించిన
మా నాయిన ప్రేమకు నేనేమివ్వగలను
బిడ్డకు జ్వరం వచ్చిందని నాయనకు చెప్తే
సైకిల్ కూడా లేని నాన్న తన భుజాలనే సింహాసనంపై నన్ను మోసి
మోపుడు ప్రేమను తన కన్నీళ్లుగా చిలకరించి
సూది మందేసేదాకా సుక్క నీళ్లు కూడా తాగక
నా బతుకులోనే తన బతుకును చూసిన
మా నాయన త్యాగానికి నేనేమివ్వగలను
ఈ అక్షరాలతో తన త్యాగాన్ని అభిషేకించడం తప్ప..
కన్నోళ్లే కనిపించే దేవుళ్ళని తలచి నా కవితలతో వారిని పూజించటం తప్ప..!
రచయిత : వడ్డి సుధాకర్
ప్రేమ ఆప్యాయతలను పంచడమే కాకుండా బంధాల బంధుత్వాల విలువలను నేర్పిస్తూ, భవిష్యత్తుకి గొప్ప అనుభూతుల్ని అందించే తల్లిదండ్రులకు ఏమి ఇవ్వగలం అంటూ ఉన్నతమైన వారి అడుగుజాడల్లో మనల్ని నడిపిస్తున్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలుపుతున్నారు రచయిత.
పొట్టకూటి కోసం సద్ది కట్టుకుని ఎండకు మాడినా, వానకు తడిచినా తీసుకున్న కూలీని కొంగులో దాచిపెట్టి , మాపిటేల ఇంటికొచ్చి పిల్లల్ని ముద్దాడి, కొనుక్కోమని రూపాయి తీసి ఇచ్చే అమ్మ ప్రేమకు ఏమి ఇవ్వగలను అంటూ అమ్మ లాలింపుని మరొకసారి గుర్తు చేశారు.
ఒళ్లంతా అమ్మ పూస్తే, వేపాకు తీసుకొచ్చి, దగ్గర కూర్చుని, కంటికి రెప్పలా కాపాడుతూ, బిడ్డ బాగోగులు చూసుకునే కమ్మని అమ్మ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, రాతలతో అమ్మ మనసును భవితకు చూపడం తప్ప అంటూ రచయిత భావోద్వేగాపూరితమైన భావాన్ని బయటకు చూపించడంలో తల్లిదండ్రులకు ఇస్తున్న గౌరవం మరొకసారి మనసుకి హత్తుకునేలా చేస్తుంది.
కన్నబిడ్డలకి కడుపునిండా కూడు పెట్టడానికి, ఉదయమే పలుగు పట్టుకుని పొలానికి పోయి, ఎర్రటి ఎండలో కష్టిస్తున్న తండ్రి ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ఉన్నంతలో ఉన్నతంగా సంతోషాన్ని అందించిన నాన్న ప్రేమను ఏ త్రాసుతో కొలవాలి, అంటూ నాన్న బిడ్డల కోసం పడే కష్టాన్ని ఎంతో సున్నితంగా వివరించారు రచయిత.
జ్వరం వచ్చిందని నాయనకు చెబితే, సైకిల్ కూడా లేని నాన్న తన భుజాలనే సింహాసనంపై నన్ను మోసి మోపుడు ప్రేమను తన కన్నీళ్లుగా చిలకరించి, సూది మందేసే దాకా సుక్క నీళ్లు కూడా తాగకుండా అల్లల్లాడిపోతున్నాడే ఆయన త్యాగానికి ఏమి ఇవ్వగలను అక్షరాలతో తన త్యాగాన్ని అభిషేకించడం తప్ప అంటూ తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను అక్షరాలతో పోల్చడం ఎంతో అద్భుతంగా అనిపించింది.
కన్నోళ్లే కదా కనిపించే దేవుళ్ళు అంటూ గొప్ప భావాన్ని, ప్రేరణాత్మకమైన ఆలోచనలను పాఠకులకు అందించారు, సంవత్సరంలో ఒక్కసారి జరుపుకునే పండుగను మరొకసారి గుర్తు చేసి, తల్లిదండ్రుల ఉన్నతాన్ని, వారు మన కోసం పడే కష్టాన్ని, మరొకసారి గుర్తు చేసి మనసుని తడి చేశారు.
ఇలాంటి మరెన్నో అద్భుతమైన, ఉన్నతమైన కవనాలు మీ కలం నుంచి పుట్టాలని, ఈ సాహితీ ప్రయాణంలో మరెన్నో రచనలు మీరు చేస్తూ, పాఠకుల మనసులలో చిరకాలం చిరునవ్వుల సంతకం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సమీక్ష : పోలగాని భాను తేజశ్రీ













Leave a Reply