సింహగర్జన సంపాదకుడు, డా సునీల్ కుమార్ యాండ్ర : దేశాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు సిద్ధమవుతున్న భారీ ఉగ్రవాద కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సమర్థవంతంగా భగ్నం చేసింది. ఈ నెట్వర్క్లో పట్టుబడ్డ ప్రధాన సూత్రధారి ఎవరో కాదు. స్వయంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్. గుజరాత్ ఏటీఎస్ అధికారులు అందించిన వివరాలు షాక్కు గురిచేస్తున్నాయి. మొహియుద్దీన్ సయ్యద్ (35), తన ఇంటిని ఏకంగా రహస్య ల్యాబ్గా మార్చుకున్నాడు. అక్కడ అతను ఆముదం గింజలను ప్రాసెస్ చేసి, వాటి వ్యర్థాల నుంచి అత్యంత ప్రమాదకరమైన ‘రైసిన్’ విషరసాయనాన్ని తయారు చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. నిపుణుల ప్రకారం, రైసిన్ అనేది అతి తక్కువ మోతాదులోనూ ప్రాణాలను తీయగలిగే అత్యంత శక్తిమంతమైన విష రసాయనం. మోహియుద్దీన్ తన ఉగ్ర కార్యకలాపాల కోసం రద్దీగా ఉండే ప్రాంతాలనే లక్ష్యంగా ఎంచుకున్నాడు.
ఢిల్లీ ఆజాద్పూర్ మండీ (మార్కెట్), అహ్మదాబాద్ నరోడా ఫ్రూట్ మార్కెట్, లఖ్నవూ ఆర్ఎస్ఎస్ ఆఫీసు, ఈ ప్రాంతాల్లో జనం రద్దీ అధికంగా ఉండటంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించడానికి అనువైన అవకాశముందని నిందితుడు భావించినట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డీఐజీ సునీల్ జోషి మీడియాకు తెలిపారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రకారం బాగా చదువుకున్న మొహియుద్దీన్ తీవ్రవాద భావజాలంతో ప్రభావితమయ్యాడు. అతను కేవలం రైసిన్ తయారు చేయడమే కాక, ఉగ్రదాడికి నిధులు సేకరించడం మరియు వ్యక్తులను నియమించడం వంటి పెద్ద ప్రణాళికలను రూపొందించాడు. ఈ కేసులో మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. మొహియుద్దీన్ అరెస్ట్ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొహియుద్దీన్ సోదరుడు ఉమర్ మాట్లాడుతూ తమ సోదరుడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు. ఎవరో బిజినెస్ పేరుతో మోసం చేసి, అతడిని ఉగ్ర కార్యకలాపాల్లోకి లాగి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఆయన కోరుతున్నారు.
















Leave a Reply