Advertisement

ఎంపీఎస్ విద్యార్థుల పట్టుదల అద్భుతం

మార్చ్ ఫాస్ట్ తో పాత రోజులను గుర్తుకు తెచ్చారు

ఎంపీఎస్ వార్షిక క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో సీఐ సురేష్

మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : ఎంతో క్రమశిక్షణతో ఎంపీఎస్ విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ లో జరిగిన తన పాత రోజులు గుర్తుకు వచ్చాయని మండపేట టౌన్ సీఐ డి.సురేష్ అన్నారు. ఏటా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థలు నిర్వహించే వార్షిక క్రీడా పోటీలను సీఐ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత జాతీయ జెండాను ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు ఆవిష్కరించగా, స్కూల్ జెండాను సీఐ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు అత్యంత ఆకర్షణీయంగా మార్చ్ ఫాస్ట్ నిర్వహించి సీఐకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన క్రీడా జ్యోతిని వెలిగించారు. తదనంతరం జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తన చిన్నతనంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారమని, ఇప్పుడు కూడా అన్ని విద్యా సంస్థలు క్రీడలకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. క్రీడలు విద్యార్థులను మానసికంగా రాటుదేలుస్తాయన్నారు. ముఖ్యంగా మార్చ్ ఫాస్ట్ ఎంతో లయబద్దంగా నిర్వహించారని, దీనిని బట్టి ఈ స్కూల్లో విద్యార్థులకు విద్యను ఎంత అంకితభావంతో నేర్పిస్తారో అర్ధం చేసుకోవచ్చన్నారు. స్కూల్ నిర్వాహకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం సీఐను చిన్నారావు మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్, కళాశాల ప్రిన్సిపాల్ సాయి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు విద్యార్థులకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మూడు రోజులు పాటు జరిగే ఈ పోటీలు ఈ నెల 14న ముగియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *