Advertisement

ఏపీలో భారీ పెట్టుబడులకు రిలయెన్స్ గ్రీన్ సిగ్నల్… సీఎం చంద్రబాబుతో భేటీలో కీలక నిర్ణయం

– సీఐఐ సదస్సులో రిలయెన్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

– రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ అంగీకారం

– ఏఐ డేటా సెంటర్, సోలార్ ప్లాంట్, ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ప్రకటన – 1 గిగావాట్ సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ నిర్మాణం

– కర్నూలులో 170 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ – వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు

విశాఖపట్నం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. విశాఖ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయెన్స్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.ఎస్.ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావు ముఖ్యమంత్రితో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా 1 గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన జిపియులు, టిపియులు, ఏఐ ప్రాసెసర్‌లతో కూడిన ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయెన్స్ ఏఐ డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏపీలో ఈ సెంటర్ పనిచేస్తుంది.

ఈ రెండు కేంద్రాలతో ఆసియాలోనే అత్యంత బలమైన ఏఐ నెట్‌వర్క్‌లలో ఒకటిగా రిలయెన్స్ అవతరించనుంది. ఈ ఏఐ డేటా సెంటర్ విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా 6 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును కూడా రిలయెన్స్ నిర్మించనుంది. దీంతో పాటు కర్నూలులో 170 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యాలతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంపై నమ్మకంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *