Advertisement

ఏపీ లిక్కర్ కేస్ – క్లైమాక్స్ ఎప్పుడు?

విజయవాడ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో అరెస్టుల పరంపర సాగుతోంది. తాజాగా లిక్కర్ స్కామ్‌ లో డబ్బుల్ని వైట్ చేసిన మనీలాండరింగ్ నిపుణుడు అనిల్ చోక్రాను ముంబై నుంచి అరెస్టు చేసి తీసుకు వచ్చి రిమాండ్ కు తరలించారు. అంతకు ముందే ఆయనను ముంబైకి వెళ్లి పట్టుకుని ఎలా డబ్బులు రూటింగ్ చేశారో మొత్తం తెలుసుకున్నారు. తర్వాత అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు. కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి డబ్బులను చోక్రా వైట్ చేశారు. ఈ ఆధారాలను కోర్టులో ప్రవేశపెడతారు. అంత వరకూ బాగుంది కానీ అసలు సూత్రధారి గురించి ఎప్పుడు బయటకు వస్తుందన్నది కీలకంగా మారింది.

  • లిక్కర్ స్కాంలో సూత్రధారి బయటకు రాకపోతే శ్రమ వృధా

ఏపీలో ఐదు సంవత్సరాల పాటు సాగిన లిక్కర్ దందాలో అంతిమ లబ్దిదారు ఎవరో ఏపీలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. పాత్రధారులంతా ఇలా కొంచెం సంపాదించుకుని ఉండవచ్చు కానీ అసలు జేబులు నిండింది సూత్రధారికే. వైట్ చేసి ఇచ్చింది కూడా ఆయనకే. ఆయనెవరో కూడా తెలుసు. సీఐడీ సిట్ ఇంకా ఆ దిశగా ఎంత దూరం ముందుకు వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్కరి తర్వాత ఒకరిని అరెస్టు చేస్తూనే పోతోంది. ఆ సూత్రధారి వద్దకు కేసును ఎంత వేగంగా తీసుకెళ్తే కేసు అంత బలంగా మారుతుంది.

  • మందుబాబుల శాపనార్ధాలు ఫలించాల్సిందే

ఐదు సంవత్సరాల పాటు మద్యం తాగేవారిని తగ్గిస్తామని విపరీతంగా రేట్లు పెంచారు. ఆ పెంచిన రేట్లకు .. స్వయం తయారీ నకిలీ లిక్కర్ అమ్మారు. వేరే బ్రాండ్స్ ను ఏపీలో దొరకనీయలేదు. ఏపీ బ్రాండ్లు బయట అమ్మనీయలేదు. అచ్చంగా ప్రముఖ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మి వేల కోట్లు వెనకేసుకున్నారు. ఆ సొమ్మంతా బంగారంతో పాటు పెట్టుబడుల రూపంలో సూత్రధారికి చేరింది. ఆ లింక్ తేల్చే వరకూ ఈ కేసు సాగుతూనే ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ కాలం సాగితే అంతగా బోర్ కొట్టేస్తుంది. అందుకే సిట్ ఇందులో వేగం పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. అలా జరిగితేనే లక్షలాది మందు బాబుల శాపాలకు తగిన శిక్ష పడినట్లు అవుతుంది.

  • చాలా కేసులున్నాయి.. ఈ కేసును క్లైమాక్స్ తెస్తే బెటర్

ఐదు సంవత్సరాల పాటు చేసిన అరాచకాలకు చాలా కేసులు రెడీగా ఉన్నాయి. ఒక దాని తర్వాత ఒకటి అలా బయటకు వస్తే రొటీన్ అయిపోతాయి. ముందు బయటపడిన కేసులకు సంబంధించి ఓ లాజికల్ కంక్లూజన్ తీసుకు రావాల్సి ఉంది. లేకపోతే ప్రజలు కూడా ఆసక్తి కోల్పోతారు. నిందితులు ఇప్పటికి చాలా మంది జైళ్లలోనే ఉన్నారు. కొద్ది మంది బయటకు వచ్చినా వారి బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరుగుతోంది. ఇది ఎంత కాలం సాగితే అంత ఎక్కువగా ప్రజలు రొటీన్ ఫీలవుతారు. లాజికల్ కంక్లూజన్ చూపిస్తేనే.. ప్రజలకు కాస్త నమ్మకం ఏర్పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *