- ఒక్కసారిగా కుప్ప కూలిన ప్రకాష్
- మండపేటలోనే తుది శ్వాస
మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 24 : ఆదివారం రాత్రి ఓ మిత్రుడికి సంబంధించిన ఫంక్షన్ కు వెళ్లాల్సి ఉన్నా కాస్త అనారోగ్యంగా అనిపించడంతో ప్రకాష్ ఆగిపోయారు. రాత్రి 8.30 సమయంలో మెడ కండరాల వద్ద నొప్పిగా ఉండటంతో పి.ఎం.పి త్రిమూర్తులకు ఫోన్ చేశారు. సాధారణంగా ప్రకాష్ చిన్న చిన్న సమస్యలకు త్రిమూర్తులునే పిలుస్తారు. దీన్ని కూడా ఆయన చిన్న విషయంగానే భావించారు. 8.34కు ఆయనకు ఫోన్ చేయగా వెంటనే అక్కడకు చేరుకుని బీపీ చెక్ చేశారు. బీపీ 180 ఉండటంతో మాత్రలు రాసి ఇచ్చారు. మజ్జిగ తీసుకుని పడుకున్న ఆయనకు అసౌకర్యంగా అనిపించడంతో 9.45 కి మిత్రులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే వారు డాక్టర్ బిక్కిన గోపాల కృష్ణకు తెలియజేయడంతో ఆయన ఆసుపత్రికి తీసుకురమ్మని ప్రకాష్ రావడానికి ముందే హుటాహుటిన గోపాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు.
10.15కి ఆసుపత్రికి నడుచుకుంటూ వచ్చిన ప్రకాష్ కు బీపీ పరీక్షించారు. 140/200 ఉండటంతో వెంటనే హుటాహుటిన ఇంజక్షన్ లు మాత్రలు తీసుకురమ్మని సిబ్బందికి చెప్పారు. అయితే ఇంజక్షన్ కు వెళ్ళిన క్షణాల్లోనే ప్రకాష్ ఒక్కసారిగా నొప్పితో కుప్ప కూలిపోయారు. తీవ్రమైన గుండె పోటుకు గురయ్యారు. వెంటనే చేయాల్సిన అత్యవసర వైద్యం అంతా ప్రయత్నించినప్పటికీ ఆయన నుండి ప్రతి స్పందన కనిపించలేదు. దీంతో వెంటనే బొల్లినేని కు తీసుకెళ్ళమని చెప్పడంతో ఆఘమేఘాలపై అంబులెన్స్ లో తరలించారు. అయితే రాజమండ్రికి వెళ్లిన తరువాత అంబులెన్స్ లో వుండగానే పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బహుశా మండపేటలోనే ఆయన తుది శ్వాస విడిచి వుంటారని భావిస్తున్నారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి అవసరం ఉన్నా లేకపోయినా బీపీ, షుగర్, గుండె ఇతర పరీక్షలు చేయించుకుంటూ ఉండటం కొందరు మంచి విషయంగా భావిస్తుంటారు. ప్రకాష్ కూడా అదే విధంగా చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండకపోదునని మిత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.













Leave a Reply