Advertisement

నేటి పత్రికలు… నాటి ఆనవాళ్లు…

ఒక ఊరు,

ఒక జిల్లా,

ఒక రాష్ట్రం,

ఒక దేశం

ఇలా ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో జరుగుతున్న విశిష్టతలు, మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయం, చదువు, ప్రభుత్వం చేస్తున్న పనులు, ప్రతిపక్షాల దుష్ప్రచారాలు, ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలు, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు, పేదవాడి నుంచి పెద్ద పెద్ద భవనాలలో బతుకుతున్న బలా జాదుగాడి వరకు, అనేక వార్తలను ప్రచారం చేస్తూ ఇంటింటి గుమ్మాన్ని తాకుతూ, ఎంతో జ్ఞానాన్ని జనాల మెదళ్లలోకి పంపిస్తుంది వార్తాపత్రిక.

అప్పట్లో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉన్నా, లోకాన ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం, కాస్త చదువుకున్న పిల్లాడిని పక్కన కూర్చోబెట్టుకుని , పంచాయతీల దగ్గర, ఊరు మధ్యలో ఉన్న మర్రి చెట్టు కింద పెద్దవారు పిల్లాడు చెప్తుంటే వార్తలు వినేవారు.

తొలి పొద్దుకాకముందే అందంగా ముస్తాబయి, సైకిల్ స్టాండ్ లో కూర్చుని, ఊరూరా తిరుగుతూ అన్ని ఊర్లలోని విశేషాలను అందరికీ అందించేది దినపత్రిక. – పేర్లు కూడా అనేకమే దినపత్రిక వారపత్రిక పక్షపత్రిక మాసపత్రిక వార్షిక పత్రిక ఆదివారం రోజున సండే బుక్స్, స్వాతి బుక్స్, నెల నెలా మ్యాగజైన్స్ అనేకానేక రకాలుగా, అనేక వినోదాలను తనలో నింపుకుని, సినిమా బొమ్మలు, అనేక ఆటలు, రాజకీయాల గురించి, దేశాలు దాటెల్లి ఆడుతున్న ఆటగాళ్ల గురించి, అనేక రుచుల గురించి, వాటిని తయారు చేసుకునే విధానం గురించి, ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, సమాజాన జరుగుతున్న పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం కోసం అన్ని రకాల సమాచారాలు ఐదారు పేపర్లలో క్లుప్తంగా ముద్రించేవారు. నాగరికత అంచెలంచలుగా పెరుగుతున్న క్రమంలో వార్తాపత్రిక ఆన్లైన్ ప్లాట్ఫారం మీద కొత్త రూపాంతరాన్ని చేజిక్కించుకుంది.

విందులు వినోదాలతో పాటు పత్రికల సంఖ్య కూడా అనేకంగానే పెరిగింది. కొత్త కొత్త సాహిత్య సంస్థలు,అనేక రాజకీయ పార్టీల పత్రికలు, ఇలా చెప్పుకుంటూ పోతే సాహిత్యం కోసం కొన్ని పత్రికలు ఉంటే, రాజకీయం కోసం మరికొన్ని, విద్యార్థుల పోటీ పరీక్షల కోసం కొన్ని పత్రికలు ఉంటే, ఆంగ్లాన్ని అనర్గళంగా నేర్చుకోవడం కోసం ఇంకొన్ని, ఊరూరా తిరిగే పత్రికలు కొన్ని అయితే, చరవాణిలో బంధింపపడ్డ పత్రికలు ఇంకొన్ని, ఏ పత్రిక అయినా సమాచారాన్ని ఇవ్వడం కోసమే, కాస్త మేధోసంపత్తి పెంచుకోవడం కోసమే, రోజుకో గంట సమయాన్ని పెట్టి చదివితే, ఎంతో సులభంగా ప్రభుత్వ ఉద్యోగం మీ వెంట.

ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకు, క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ఆశ ఏదైనా ఆశయం ఒక్కటే, అనుసరించాల్సిన పద్ధతి ఒక్కటే, దానికి మూలమే వార్తాపత్రిక, ఎందరో జీవితాలను మార్చింది, మరెందరినో మేధావులుగా తీర్చిదిద్దింది, ఎందరికో ఆసరాగా నిలబడింది, జర్నలిజానికి నిజాన్ని చూపించడానికి దిక్సూచి అయ్యింది. అక్షరాలు తనువు నిండా నింపుకుని జ్ఞాన సరస్వతిగా మారి అందరి చేతుల్లో వాలింది. మారుతున్న పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న సామాజిక అంశాలు, రోబోట్ లు ఉద్యోగం చేస్తున్న ఈ యుగంలో ఇంకా దినపత్రికలు చదువుతున్న వారు ఉన్నారు అంటే ఎంతో గొప్ప విషయమనే చెప్పాలి. పత్రికను నడుపుతున్న వారికి, సమాచారాన్ని సేకరించి టైపింగ్ చేస్తున్న వారికి, ఆ కష్టాన్ని వృధా కానివ్వకుండా రోజూ పత్రికలు చదువుతున్న వారికి అందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు…

  • పోలగాని భానుతేజశ్రీ గౌడ్ MBA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *