Advertisement

పట్టుబడతాననే భయంతోనే.. ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..!

– తన దగ్గరున్న పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడి

– డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్, ఇంధనాలతో పేలుడు

– ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసుల వివరణ

ఢిల్లీ, సింహగర్జన సంపాదకుడు, డా సునీల్ కుమార్ యాండ్ర, నవంబర్ 11 : ఢిల్లీలో చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఫరీదాబాద్ లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్యాంగుకు చెందిన వ్యక్తే సోమవారం బాంబు పేలుడుకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురైన నిందితుడు ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వంటివే తాజా బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ తో పాటు ఇంధనం ఉపయోగించి పేలుడు జరిపినట్లు తెలిపారు. పేలుడు జరిగిన కారులో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్‌ మహ్మద్‌ గా పోలీసులు గుర్తించారు. సోమవారం పట్టుబడ్డ ఉగ్రవాద ముఠాకు, ఉమర్ మహ్మద్ కు సంబంధం ఉందని భావిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో కారులో ఉమర్‌తోపాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే విషయం తెలుసుకోవడానికి దర్యాగంజ్, పహార్‌గంజ్ ప్రాంతాలలోని హోటళ్లు, లాడ్జిల ఎంట్రీలను తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *