తణుకు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 18 : స్వాతంత్ర్య ఉద్యమంలో పత్రికలు ప్రముఖ పాత్ర వహించాయనీ, పత్రికలు సమాజ శ్రేయస్సుకు, అభివృద్ధికి మార్గదర్శకత్వం వహించాలని ప్రముఖ జర్నలిస్టు బెల్లంకొండ బుచ్చిబాబు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో బెల్లంకొండ బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని “సామాజిక అభివృద్ధిలో మీడియా పాత్ర” అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. భారత దేశంలో మొదటి పత్రిక 1780వ సంవత్సరంలో ఆంగ్లంలో ప్రచురించిన “బెంగాల్ గెజిట్” అనీ, తెలుగులో మొదటి పత్రిక 1902లో ప్రచురించిన “కృష్ణా పత్రిక” అనీ ఆయన వివరించారు. ఆనాడు పత్రికలు స్వాతంత్ర్య సమరంలో దేశభక్తులకు, ప్రజలకు స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిల్చాయని బుచ్చిబాబు పేర్కొన్నారు. పత్రికలు సమాజ శ్రేయస్సుకోసం నిబద్ధతతో కూడిన సత్యమైన వార్తలు ప్రచురించాలని కోరారు. ముందుగా సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. సభకు మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సభలో మరో ముఖ్య అతిధి, స్థానిక ఇంపల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కలగ నాగ వెంకట రామ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలో విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చెయ్యాలని, సెల్ ఫోన్ కు దూరంగా ఉండి, విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలు సమగ్రంగా చదువుకోవాలని హితవు పలికారు. అదే విధంగా విద్యార్థులు గ్రంథాలయం సందర్శించి దిన, వార, మాస పత్రికలు, రిఫరెన్స్ పుస్తకాలు అధ్యయనం చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని హితవు పలికారు. సభలో చివరిగా బెల్లంకొండ బుచ్చిబాబు, కలగ నాగ వెంకట రామ్ కుమార్ లను దుశ్శాలువాలతో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కౌరు వెంకటేశ్వర్లు, కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు ప్రభృతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ & సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు భార్య గుత్తికొండ స్రవంతి, తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ కళాశాలలో నడుస్తున్న వాకర్స్ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు, మానవతా నాయకులు ఆలపాటి సుబ్బారావు, రోటరీ క్లబ్ నాయకులు అక్కిన కాశీ విశ్వనాథం, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కోశాధికారి అర్జి భాస్కరరావు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, శ్రీ శ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఛైర్మన్ పోపూరి దక్షిణా మూర్తి, ప్రముఖ కవి వి.ఎస్.వి.ప్రసాద్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ యం.ఉమాజ్యోతి, రిటైర్డ్ ఉపాధ్యాయులు మహమ్మద్ స్వాలీహా, రికార్డ్ అసిస్టెంట్ రాగాల పృథ్వీ నారాయణ ప్రభృతులు, చదువరులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. చీకటి శ్రీనివాసరావు వందన సమర్పణతో నాటి సభ ముగిసింది. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
పత్రికా రంగంలో నిబద్ధత కావాలి : ప్రముఖ జర్నలిస్ట్ బెల్లంకొండ బుచ్చి బాబు















Leave a Reply