– గోపీనాథ్ తల్లి మహానందకుమారి సంచలన వ్యాఖ్యలు
– గోపినాథ్ తల్లి, గోపినాథ్ మొదటి భార్య, కొడుకు పత్రికా సమావేశం
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 09 : దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై ఆయన తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీగా అనిపిస్తోందని, తమకు అనుమానాలున్నాయని అన్నారు. ఆయన ఎప్పుడు చనిపోయారన్నది తల్లిగా తనకే తెలీదన్నారు. ‘జూన్ 6న చనిపోయారా..? 8న చనిపోయారా?’ అన్నదీ సందేహంగానే ఉందన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌తో కలిసి మహానంద కుమారి పాత్రికేయులతో మాట్లాడారు. కేటీఆర్ వచ్చిన తర్వాత మరణవార్తను బయటకు చెప్పారు. గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే.. ఒక్క రోజు కూడా చూడటానికి టైమ్ ఇవ్వలేదు. ఒక్క అటెండర్‌ను కూడా పెట్టలేదు. గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు. లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మొదటి భార్య, బిడ్డలు, నా పేరు కూడా లేదు. మొదటి భార్యతో విడాకులు కూడా కాలేదు. నేను గోపీనాథ్‌తో సునీత పెళ్లి చేయలేదు. ఫ్యామిలీ సర్టిఫికెట్లో మా పేరు లేదు. కేటీఆర్ వెంట పరుగెత్తి నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలి అనుకుంటే ఆయన కూడా వినలేదు. ఇది డబ్బు సమస్య కాదు. మాకు గుర్తింపు లేదు. అందుకే మీడియా ముందుకొచ్చాం. తల్లిగా ఎంతో బాధపడుతున్నా. గోపినాథ్ తల్లిగా కేటీఆర్ తనను కనీసం కలవలేదు, సునీతకు టికెట్ ఇచ్చేటప్పుడు కేటీఆర్ మాకు కనీసం సమాచారం ఇవ్వలేదు. నాకు 93 ఏళ్ల వయసులో ఇలా బయటకు రావడం బాధగా ఉంది. మాకు ఏ పార్టీతో సంభందం లేదు. మాకు అన్యాయం జరిగింది. గోపీనాథ్ మొదటి భార్య, కుమారుడికి గుర్తింపు ఉండాలి కదా, మాలిని ఎంతో బాధపడుతోంది. ఎన్నో అవమానాలు పడింది. వద్దు అనుకుంటే మొదటి భార్యతో ఎప్పుడో విడాకులు తీసుకునేవాడు. అలా జరగలేదు అంటే.. సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే కదా. నలుగురిలో నిరూపించుకోవాలనే బయటకు వచ్చాం. నా పెద్ద కొడుకు కూడా టికెట్ కోసం ప్రయత్నించాడు. గోపీనాథ్ తల్లిగా నాకు అడగాల్సిన హక్కులేదా? లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మా పేర్లు లేవని ఆగస్టు 11 నుంచి తహసీల్దార్ కార్యాయానికి వెళ్లి వస్తున్నాం. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు అని అన్నారు.
– మాకు గుర్తింపు లేదు : తారక్ ప్రద్యుమ్న
నా పాస్‌పోర్ట్, ఇతర పత్రాల్లో తండ్రిగా గోపీనాథ్ పేరే ఉంది. చట్ట పరంగా కూడా అన్ని సక్రమంగా ఉన్నాయి. ఎమ్మార్వో ఆఫీస్ లో కూడా సబ్మిట్ చేశాను. మా అమ్మతో చట్టపరంగా విడాకులు కాలేదు. తారక్ అంటే ఎవరో తెలియదన్న మాగంటి సునీత.. జూన్ 6న నాకు మొదటి సారి ఫోన్ చేశారు. ఎవరో తెలియకపోతే.. ఎందుకు ఫోన్ చేసినట్లు? గ్రాడ్యుయేషన్ డేకి రావాలని మా నాన్న అనుకున్నారు. కానీ హఠాత్తుగా చనిపోయారు. సునీత నాకు ఫోన్ చేసి.. నువ్వు ఇండియా రావాల్సిన అవసరం లేదు. రెజ్యూమె పంపించు కేటీఆర్ అంకుల్ కంపెనీస్‌లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. మా పెద్దనాన్న మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారు. జూన్ 25న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు. అప్పుడు అఫిడవిట్లో ఎవరి పేర్లు పెట్టారో నాకు తెలియదు. మా అమ్మ, నాన్నమ్మ, నా పేర్లను లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో పెట్టాలి అని కోరారు.
















Leave a Reply