Advertisement

రణం – మరణమైతే

భూమ్యాకాశాలు ఒక్కటై

అవని అంతా అతలాకుతలమవుతుంటే

ఆకాశపు రెక్కలు తెగి చల్లచెదురుగా పడుతుంటే

కనీవిని ఎరుగని కళంకం

బలహీనుల గుండెల్లో ఇంద్రధనువు – బాణమై  గుచ్చుకుంటుంటే

సప్తవర్ణాలు మొత్తం ఎర్రటి రుధిరాన్ని మింగినట్టు

పాతాళమై ప్రవహిస్తుంటే

ప్రజల ఆక్రోధన బతుకు బాటకై ఆరాటపడుతుంది

తూటాలు దిగిన కేకలు కలలో మేల్కొలుపులా తుళ్ళి పడుతున్నాయి

చిరిగిన ఆశల బతుకులు – చుక్కాని లేని పడవలా

చెమ్మగిల్లిన కళ్ళతో చిరుజల్లులు కురిపిస్తున్నాయి…

ఎన్ని గొంతుకలు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని రోధిస్తున్నాయో

రాత్రిళ్ళు నిద్రలేక, పగలు బయటకు రాలేక, ఎన్ని మనసులు సంకెళ్లు వేసుకుని,

గూటి పక్షుల్లా మారాయో…

రణం – మరణమై ఎగసి వస్తుంటే

పిట్టల్లా రాలిపోయిన ప్రాణాలు ఎన్నో…

అంటూ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని,

జరుగుతున్న అనర్ధాలను, కనులకు సాక్షాత్కరిస్తూ ఈ రచయిత కవితను అలిన తీరు అమోఘం…

  • ఇక కవిత్వం విషయానికి వస్తే…
  • శీర్షిక : యుద్ధం – శాంతి

ఎప్పుడూ వినిపించే మాటలివి ఇప్పుడైతే ఇంకాస్త బిగ్గరగా వినిపిస్తున్నాయి…

క్షిపణుల మెరుపు దాడులతో నిస్సిగ్గుగా కొనసాగుతున్న నరమేధం..!

కొందరు శాంతి కోసమే యుద్ధం అంటారు మరికొందరు యుద్ధం శాంతి కోసం అంటారు …

శోకమయమైన అమానవీయ దాడుల్లో నిస్సహాయులుగా బలైపోతున్నది సామాన్యులు..!

ఒకరి రాజ్యం సరిహద్దులు మారవచ్చు ఒకరి దేశం పూర్తిగా నేలమట్టం కావచ్చు…

ఒకరి అహంకారానికి ఇంతటి భారీ మూల్యమా… అతలాకుతలమవుతున్న కోట్లాది కుటుంబాలు..!

ఎన్ని మార్లు యుద్ధాలు అనర్ధదాయకమన్నా వినిపించుకునే రాజ్యాధినేతలు కరువయ్యారు…

ఆధిపత్య పోరులో విజయమెవరిదైనా కావచ్చు ఆత్మగౌరవ అస్తిత్వ సమరానికి చేయూతనిద్దాం…!

  • రచయిత : గోపగాని రవీందర్

9440079882

  • సమీక్ష

ఎప్పుడూ వినిపించే మాటలే కానీ ఎందుకో ఇప్పుడు ఇంకాస్త బిగ్గరగా వినిపిస్తున్నాయి, క్షిపణుల మెరుపుల దాడులతో – నిస్సిగ్గుగా నరమేధం కొనసాగుతుంది…

ఈ యుద్ధం శాంతి కోసం అంటారు కొందరు, కాదు కాదు శాంతి కోసమే యుద్ధం అంటారు మరి కొందరు, వాస్తవంగా మాట్లాడుకుంటే , శాంతి ఉంటే యుద్ధం అనేది జరగదు కదా…

ఈ దాడుల్లో నిస్సహాయులుగా బలైపోతున్న సామాన్యులు ఎందరో, బతుకు పోరాటం చేస్తూ – యుద్ధపు దాడులలో నిస్సహాయంగా ప్రాణం కోల్పోయిన బాటసారులు ఎందరో… అంటూ యుద్ధం వల్ల ఎదురయ్యే సమస్యలను, ఏ తప్పు చేయక ప్రాణాలు కోల్పోతున్న సామాన్యుల గురించి ఎంతో ఆవేదనతో వివరించారు రచయిత…

ఈ యుద్ధంలో ఒకరి రాజ్యం సరిహద్దులు మారవచ్చు, అలాగే మరొక దేశం పూర్తిగా నేలమట్టం కావచ్చు, కానీ ఒక్కరి అహంకారానికి ఇంతటి భారీ మూల్యం చెల్లించడం తగునా…!? అతలాకుతలమవుతున్న కోట్లాది కుటుంబాలకు దిక్సూచిగా నిలబడేది ఎవరు…!?

ఈ యుద్ధాలు అనర్ధదాయకం అనే రాజ్యాధినేతలు కరువయ్యారు, ఈ ఆధిపత్య పోరులో విజయం ఎవరిదైనా కావచ్చు ఆత్మగౌరవ అస్తిత్వ సమారానికి చేయూతనివ్వాల్సింది మనమే…

అందరం ఒక్కటేనని చాటి చెబుతూ, శాంతి కోసమే మన బ్రతుకు పోరాటం అని నినాదం ఇస్తూ, జరుగుతున్న ఈ రణ తంత్రాన్ని ఆపాల్సిన కనీస బాధ్యత ప్రాణమున్న మానవులుగా మనందరికీ ఉంది…

ఆకాశాన్ని తాకుతున్న ఆ అగ్ని జ్వాలలను ఆపాలి, కనికరం లేని కసాయి రాక్షసులు పేల్చుతున్న మారనాయుధాలకు స్వస్తి చెప్పాలి, అమానవీయ ఈ లోకంలో మానవత్వాన్ని నిలబెట్టాలి…

అద్భుతమైన సందేశాన్ని అందిస్తూ, జరుగుతున్న పరిస్థితిని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ, రక్తం చిందిస్తున్న ఈ రాచరిక రణ రంగాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని, పరిస్థితులను మార్చి, ప్రజా సామ్రాజ్యాన్ని పరిరక్షించాలని, ఎంతో ఉన్నతమైన ఆలోచనలను కలబోసి చెప్పారు రచయిత.

ఇలాంటి మరెన్నో కవనాలు మీ కలం నుంచి ఉద్భవించాలని, పాఠకుల మనసులను ఆలోచింపజేసే విధంగా మీ రచనలు ముందుకు సాగాలని, ప్రేరణాత్మకమైన మీ ఆలోచనలు అనేకమందికి ఊరటగా నిలవాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • సమీక్ష : పోలగాని భానుతేజశ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *