చిత్రం పేరు “శ్రీనివాస మంగాపురం”?
అశ్విని దత్ – జెమిని కిరణ్ సంయుక్త నిర్మాణంలో… త్వరలో!!
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 10 : సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాతలు చలసాని అశ్విని దత్ – జెమిని కిరణ్ సన్నాహాలు చేస్తున్నారు. పద్మాలయ సంస్థ కూడా చిత్ర నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం ఉంది. ఈ చిత్రానికి “శ్రీనివాస మంగాపురం” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు తనయుడైన జయకృష్ణ నటనకు సంబంధించిన అన్ని విభాగాల్లో సుశిక్షితుడై ఉన్నాడు. ఇతడ్ని హీరోగా పరిచయం చేసేందుకు పలువురు దర్శకులు పోటీ పడినప్పటికీ… ఈ గోల్డెన్ ఛాన్స్ అజయ్ భూపతి దక్కించుకున్నాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లను హీరోలుగా ఇంట్రడ్యూస్ చేసిన అశ్విని దత్ మరో వారసుడ్ని టాలీవుడ్ కి ఇవ్వనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది. “ఆర్.ఎక్స్ 100″తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి… రెండో చిత్రం “సముద్రం”తో సెకండ్ సినిమా సిండ్రోమ్ కి లోనైనా… “మంగళవారం”తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇకపోతే రమేష్ బాబు కుమార్తె భారతి సైతం తెరంగేట్రం చేస్తోంది. ప్రముఖ దర్శకుడు తేజ తన తనయుడ్ని హీరోగా పరిచయం చేస్తూ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో భారతి పరిచయం కానుంది.
















Leave a Reply