జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : ఈనెల 11వ తేదీన కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగే విప్లవ అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గండేపల్లి మండలం కే.గోపాలపురం గ్రామంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా మల్లిశాల,కే గోపాలపురం మధ్యలో ఉన్న ప్రభుత్వ పోరంబోకైన అడ్డుకొండ (585 ఎకరాల) భూమిని రెండు గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు పంచి పెట్టాలని పోరాటం సాగిస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఆ భూమిని పేద ప్రజలకు దక్కనీయకుండా చూస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న స్థానిక నియోజకవర్గం కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ఈ భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారని, ఆ ఆలోచన విరమించుకోవాలని ఆయన అన్నారు . ఈ భూమి కోసం అనేక గొడవలు, కేసులు, నిర్బంధాలు పడ్డారని, ఇప్పటికీ కూడా కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారని, ఈ విషయం ఎమ్మెల్యే గారు గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. పేద ప్రజలు అభివృద్ధి చెందాలంటే, వారి జీవన విధానం మెరుగుపడాలంటే భూమి ఒక్కటే మార్గమని ఆయన వివరించారు. ఇండస్ట్రియల్ వద్దు- పంట భూమి ముద్దు అనే నినాదంతో పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే నవంబర్ మాసమంతా విప్లవ అమరవీరులు స్మరించుకుంటూ జగ్గంపేటలో 11, కాకినాడలో 15, రంపచోడవరంలో 22, రాజమండ్రిలో 25 తేదీలలో జరిగే విప్లవ అమరవీరులు సంస్మరణ సభలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, రైతులు, కూలీలు పాల్గొని జయప్రదం చేస్తారని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచె అంజిబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు కర్నాకుల రామలింగేశ్వర రావు, గ్రామ నాయకులు వెంకటేశులు, కృష్ణ, అప్పారావు, నూకరాజు, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.
అమరుల వీరుల పోరాట స్ఫూర్తితో అడ్డుకొండ భూమిని సాధించుకుందాం – కర్నాకుల
















Leave a Reply