– శంఖుస్థాపన చేసిన ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమా, వసంత కృష్ణప్రసాద్
– ధాన్యం కొనుగోళ్ళకు శ్రీకారం
విజయవాడ రూరల్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 09 : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.1.50 కోట్లతో అంతర్గత రహదారుల అభివృద్ధికి ఆదివారం శంకుస్థాపన చేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం గొల్లపూడి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రైతులు, ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం ఇక్కడ రూ.10.35 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మార్కెట్ యార్డుకు శాశ్వతంగా ఆదాయాన్ని సమకూర్చే దుకాణాల సముదాయం, రైతు బజారు కూడా నిర్మాణం పూర్తి కావచ్చనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గొల్లపూడి ఏఎంసి ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోందన్నారు. దీనికి భూములు ఇచ్చిన గొల్లపూడి రైతుల త్యాగఫలం స్ఫూర్తిదాయకం అన్నారు. గొల్లపూడి ఏఎంసి కమిటీని అభినందించారు. కూటమి సర్కారు సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కొనుగోలు చేసిన రోజుల వ్యవధిలోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

















Leave a Reply