– ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారులో భారీ పేలుడు
– భూటాన్ పర్యటన నుంచే తీవ్రంగా స్పందించిన ప్రధాని
– బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని భరోసా
ఢిల్లీ, సింహగర్జన సంపాదకుడు, డా సునీల్ కుమార్ యాండ్ర, నవంబర్ 11 : ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 12 మంది మరణించగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్లో ఉన్న ప్రధాని మోదీ థింపూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఈ పేలుళ్ల వెనుక ఉన్న కుట్రను మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి. సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం ముందు నిలబెడతాం” అని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. “నిన్న సాయంత్రం జరిగిన ఈ భయానక ఘటన అందరినీ విషాదంలోకి నెట్టింది. బాధిత కుటుంబాల దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలను. ఈ కష్ట సమయంలో యావత్ దేశం వారికి అండగా నిలుస్తుంది” అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా అందుబాటులోనే ఉన్నానని ప్రధాని మోదీ వెల్లడించారు.
















Leave a Reply