Advertisement

నెయ్యి పాపం జగన్ నెత్తిన – భస్మాసుర వ్యూహం !

తిరుపతి, సింహగర్జన సంపాదకుడు, డా సునీల్ కుమార్ యాండ్ర, నవంబర్ 13 : కల్తీ నెయ్యి స్కాం ఎక్కడ జరిగింది.. తిరుమల తిరుపతి దేవస్థానంలో. మరి ఎవరు భుజాలు తడుముకుంటున్నారు.. జగన్మోహన్ రెడ్డి. ప్రతీదానికి ముఖ్యమంత్రి బాధ్యుడు కాదు. ముఖ్యంగా స్వతంత్ర బోర్డు ఉన్న తిరమల తిరుపతి దేవస్థానం వంటి విషయాల్లో ప్రతి నిర్ణయం సీఎంకు తెలియదు. బోర్డు పరిపాలిస్తుంది. తప్పు జరిగితే బోర్డుదే బాధ్యత. అయితే కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ రెడ్డి తీరు.. ఆయన స్ట్రాటజిస్టుల తీరు చూస్తూంటే.. అసలు స్కాం అంతా చేసింది జగన్ రెడ్డేమో అన్న అనుమానం రాకుండా ఉండదు. ఎందుకంటే.. వచ్చిన ఆరోపణలు తమపైనే వచ్చినట్లుగా వారు ఉలిక్కిపడి కౌంటర్లు ఇస్తున్నారు.

– అప్పటి టీటీడీ చైర్మన్‌ ప్రధానంగా బాధ్యుడు – జగన్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారు?

తిరుపతి లడ్డూ తయారీలో అసలు నెయ్యే వాడలేదని అంతా కెమికల్ తయారీనే అని సీబీఐ సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో నిండా మునిగిపోయేది వైవీ సుబ్బారెడ్డి. ఆయన లంచాలు తీసుకున్నాడన్నదానికి కూడా ఆధారాలు ఉన్నాయి. బినామీగా పీఏ అప్పన్నను పెట్టి ఆయన బ్యాంక్ ఖాతాలు వాడుకుని అక్కడ్నుంచి నగదు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అడ్డంగా దొరికిపోయినట్లుగా సీబీఐ సిట్ దర్యాప్తు స్పష్టం చేస్తోంది. ఇలాంటి సమయంలో వైసీపీ, జగన్ రెడ్డి ఎందుకు ఆ మరకను తమకు అంటించేందుకు ప్రయత్నిస్తున్నారన్నదే ఇక్కడ అర్థం కాని విషయం.వైసీపీ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందా..? లేకపోతే ఆ కేసు తమ దాకా వచ్చేస్తుందని అనుకుంటున్నారా?

– సుబ్బారెడ్డిని బలి చేస్తే కేసు జగన్ వరకూ రాదుగా !

ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ చేయాల్సిన పని.. తప్పు జరిగితే ఎవరినైనా శిక్షించాల్సిందేనని చెప్పి సుబ్బారెడ్డిని వదిలేయడం. ఆయన తప్పు చేసి ఉంటే శిక్షించాల్సిందేనని దేవుడి ప్రసాదం.. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి తమ పార్టీలో చోటు లేదని చెప్పి నిజాయితీ నిరూపించుకునే వరకూ సస్పెండ్ చేస్తే చాలా వరకూ సమస్య పరిష్కారం అవుతుంది. అక్కడి వరకూ ఆగిపోతుంది. కానీ సుబ్బారెడ్డి దొరికిపోతే నేను కూడా దొరికిపోతానని జగన్ రెడ్డి కంగారు పడుతున్నట్లుగా డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్డగోలు వాదనలతో ప్రజల ముందు పరువు పోగొట్టుకుంటున్నారు. ఇది జగన్ పై మరిన్ని అనుమానాలు పెరగడానికి కారణం అవుతున్నారు.

– జగన్‌కూ నెయ్యి ముడుపులు అందాయా?

నెయ్యి కల్తీ వ్యవహారం మొదట బయటపడినప్పుడు కూడా జగన్ హడావుడి చేశారు. ఆయనపై ఆరోపణలు రాలేదు. టీటీడీని పరిపాలించిన వారిపైనే నిందలు పడ్డాయి. కానీ జగన్ రెడ్డి తనపేరు ఎక్కడ బయకు వస్తుందోనన్నట్లుగా కంగారు పడి హడావుడి చేశారు. అప్పుడే చాలా మంది ఈయనేంటి భుజాలు తడముకుంటున్నారు అనుకున్నారు. ఇప్పుడు కూడా అంతే జరుగుతోంది. ఇదేమీ చిన్న విషయం కాదు. కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినది. జగన్ కు అంటించుకోకపోవడమే మంచిది. సుబ్బారెడ్డిని బాధ్యతుడ్ని చేసి తప్పించుకుంటే జగన్ కు, వైసీపీకి చాలా మంచిదని సహజంగా ఎవరికైనా వచ్చే ఐడియా. కానీ ఇక్కడ జగన్ మీదేసుకుంటున్నారు. ఆయనకు ఈ విషయంలో భస్మాసుర హస్తం లాంటి సలహాలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *