– పుస్తక పఠనంపై బాలలు–యువత దృష్టి సారించాలి
– గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తాం
– కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : కొత్తపేట శాఖా గ్రంథాలయంలో శుక్రవారం ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువుల తల్లి సరస్వతీ దేవి, భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలు, ఆధునిక దేవాలయాలు అని పేర్కొన్నారు. అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి మహామహులు గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిలా పనిచేసి సమాజ విద్యాభివృద్ధికి అపార సేవలు చేశారని గుర్తుచేశారు.
ప్రతి ఏటా నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం సంప్రదాయమని తెలిపారు. నెహ్రూకి చిన్నారులంటే అపారమైన అభిమానమున్న విషయం ఈ సందర్భంలో ప్రస్తావించారు. డిజిటల్ యుగంలో పుస్తక పఠనం కొంత వెనుకబడినా, పుస్తకాలు మేథాశక్తి, ఆలోచనా సామర్థ్యాలను పెంపొందిస్తాయని, బాలలు–యువత తప్పనిసరిగా పుస్తక పఠన అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. ఏ రోజుల్లో గ్రంథాలయాలు జ్ఞానార్జన కేంద్రాలుగా వెలిగాయో, ఆ రోజులు తిరిగి రావాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తపేట గ్రంథాలయ భవనం తన హయంలోనే నిర్మించబడిందని, అప్పుడు జిఎంసి బాలయోగి, కోడెల, మెట్ల వంటి ప్రముఖ నాయకులు ప్రారంభోత్సవానికి విచ్చేసిన సంగతులను గుర్తుచేశారు. విద్యా–గ్రంథాలయ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీల అభివృద్ధి జరుగుతుందని, కొత్తపేట పరిధిలోని గ్రంథాలయాల అభివృద్ధికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్, బూసి జయలక్ష్మి భాస్కరరావు, పాలూరి సత్యానందం, విల్లా మారుతీ, తమ్మన సాయి ప్రసాద్, యెలిశెట్టి ప్రభాకర్, వాసంశెట్టి సత్యనారాయణతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
















Leave a Reply