• స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించి పట్టుకున్న అప్పినపల్లి గ్రామస్తులు
• అప్పినపల్లి గ్రామస్తుల ధైర్యాన్ని మెచ్చుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే స్మగ్లర్లను పట్టుకొన్నామన్న ప్రజలు
తిరుపతి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : ఎర్రచందనం అక్రమ రవాణాపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆయన అందిస్తున్న భరోసా ప్రజల్లో చైతన్యం నింపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చిత్తూరు జిల్లా అప్పినపల్లి గ్రామస్తులు ఎర్రచందనం దొంగల ఆటకట్టించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుని దుంగలను అటవీశాఖ అధికారులకు పట్టించారు. అక్రమంగా రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలను, ఆ గ్రామ ప్రజల సహకారంతో శుక్రవారం ఉదయం అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో సహకరించిన అప్పినపల్లి గ్రామస్తులను పవన్ కళ్యాణ్ అభినందించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలకు తమవంతు సహకారం అందించాలన్న ఉద్దేశంతోనే దుంగల దొంగల వాహనాన్ని వెంబడించినట్టు అప్పినపల్లి గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ పులిచర్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక టవెరా వాహనం అనుమానాస్పదంగా దూసుకువెళ్లింది. అటవీ అధికారులు ఆ వాహనాన్ని వెంబడించగా, వారు బెంగళూరు వైపు వేగంగా వెళ్లిపోయారు. మార్గమధ్యంలో వాహనం నుంచి దూకి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వాహనంలో ఉన్న డ్రైవర్ వేగంగా నడుపుకొంటూ ముందుకు వెళ్లాడు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా, అప్పినపల్లి గ్రామస్తులు ఆ వాహనాన్ని వెంబడించారు. దీంతో డ్రైవర్ కూడా వాహనాన్ని ఒక పక్కన ఆపి పారిపోయాడు. అటవీశాఖ అధికారులు, పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమంగా 10 ఎర్రచందనం దుంగలు దొరికాయి. సమాచారాన్ని అటవీ అధికారులు ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎర్ర చందనం దొంగల ఆటకట్టించే క్రమంలో గ్రామస్తులు చూపిన చొరవ, ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. అటవీశాఖ అధికారులు, పోలీసులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.
















Leave a Reply