తణుకు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 15 : పుస్తకాలు మన నేస్తాలనీ, పుస్తక పాఠం మనసుకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుందనీ, విద్యార్థినీ విద్యార్థులు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని ప్రముఖ న్యాయవాది గుడిమెట్ల వీర్రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా శనివారం స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన “పుస్తక ప్రదర్శన”ను గుడిమెట్ల వీర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు ఆహూతులకు స్వాగతం పలికారు. సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.
ఈ సభలో వేదికను అలంకరించిన మరొక అతిధి, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు మంచి భవిష్యత్తు కోసం నిరంతరం గ్రంథాలయం సందర్శించి దిన, వార, మాస పత్రికలతో బాటు, రిఫరెన్స్ పుస్తకాలు అధ్యయనం చేసి, పోటీ పరీక్షలు ఎదుర్కొని, విజయం సాధించి, మంచి ఉద్యోగాలు సంపాదించాలని హితవు పలికారు. సభలో చివరిగా ఈనాటి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది గుడిమెట్ల వీర్రెడ్డిని గ్రంధాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కౌరు వెంకటేశ్వర్లు, కార్యదర్శి చీకటి శ్రీనివాసరావులు దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సభలో ప్రముఖ జర్నలిస్టు బెల్లంకొండ బుచ్చిబాబు, గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు, వారి భార్య గుత్తికొండ స్రవంతి, సినీ గేయ రచయిత్రి పప్పొప్పు విజయలక్ష్మి, ఇంపల్స్ జూనియర్ కళాశాల అధ్యాపకుడు బి.విష్ణు, ప్రముఖ కవి వి.ఎస్.వి.ప్రసాద్, గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ రాగాల పృథ్వీ నారాయణ, చదువరులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు వ్యాస రచన పోటీ నిర్వహించారు.
















Leave a Reply