Advertisement

గ్రంథాలయ ఉద్యమకారులకు ఘనంగా నివాళులు

తణుకు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 16 : గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రామ, పట్టణ, నగరాల్లో వ్యాప్తి చేసిన మహానుభావులైన అయ్యంకి వెంకట రమణయ్య, డా.ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం, వెలగా వెంకటప్పయ్య చిరస్మరణీయులని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో కోట రామ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రోత్సహించిన వారి గురించి వివరించారు. సభలో ముందుగా ప్రముఖ న్యాయవాది, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి, కౌరు వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి అధ్యక్షత వహించారు. వావిలాల సరళాదేవి మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమానికి తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులందరికీ మనం కృతఙ్ఞులమై ఉండాలనీ, వారి స్ఫూర్తితో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమకారులైన అయ్యంకి వెంకట రమణయ్య, డా.ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం, వెలగా వెంకటప్పయ్య చిత్రపటాలకు వేదికను అలంకరించిన ప్రముఖులు, సభకు హాజరైన ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. సభలో మరో అతిధి న్యాయవాది, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు “రాజ్యాంగం – బాలల హక్కులు” అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

బాల బాలికలు స్వేచ్ఛగా జీవించే హక్కు, చదువుకునే హక్కు, సమానత్వపు హక్కు, భారత దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు రాజ్యాంగం కల్పించిందని వివరించారు. బాల బాలికలు తమ ఆపద సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు ఫోన్ చేసి పోలీసు వారి రక్షణ పొందాలని తెలియజేశారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలబాలికలు గ్రంథాలయం సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యురాలు యం.ఉమాజ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి గ్రంథ పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొంచుకోవాలని హితవు పలికారు.

కార్యక్రమంలో చివరిగా ఈ సభలో ప్రసంగించిన ముఖ్య అతిధి కోట రామ ప్రసాద్, అతిధి కౌరు వెంకటేశ్వర్లులను గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వావిలాల సరళాదేవి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు, చీకటి శ్రీనివాసరావు, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు మరియు వారి భార్య గుత్తికొండ స్రవంతి, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యురాలు యం.ఉమాజ్యోతి, ప్రముఖ కవి, రిటైర్డ్ తెలుగు పండితులు వి.ఎస్.వి.ప్రసాద్ ప్రభృతులు దుశ్శాలువాలతో సత్కరించారు. సభలో ఇంకా సభలో కెమిస్ట్ కె.శ్రీనివాస్, వేద గణిత ఉపాధ్యాయురాలు వి.లక్ష్మీ దేవి, రికార్డ్ అసిస్టెంట్ చదువరులు, వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సభలో సభాసదులను, విద్యార్థినీ విద్యార్థులను తమ నటనతో టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ అలరించారు. యం.ఉమాజ్యోతి వందన సమర్పణతో నాటి సభ ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *