• రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు… దేవాదాయ శాఖ సి.జి.ఎఫ్. నిధులు
• శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి రూ.6 కోట్లు కేటాయింపు • జీర్ణావస్థకు చేరిన ఆలయాలకు పూర్వ వైభవం
• పిఠాపురం నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష
మంగళగిరి, సింహగర్జన సంపాదకుడు, డా సునీల్ కుమార్ యాండ్ర, నవంబర్ 14 : పిఠాపురం నియోజకవర్గం పరిధిలో 10వ శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాలు, శ్రీపాద శ్రీ వల్లభ పీఠం కొలువై ఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రఖ్యాత ఆలయాలతోపాటు నియోజకవర్గంలో జీర్ణావస్థకు చేరిన ఆలయాలను ఇప్పటికే గుర్తించామనీ, వాటికి పునరుజ్జీవం కల్పించే పనులుకు అవసరమైన నిధులు దేవాదాయ శాఖ సమకూరుస్తుందని తెలిపారు. దేవాదాయ శాఖ సహకారంతో ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి అన్నారు. ప్రధాన ఆలయాలు అయిన శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఆలయాలతోపాటు 19 ఆలయాల అభివృద్ధి నిమిత్తం కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు ఇప్పటికే దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందనీ, మ్యాచింగ్ గ్రాంట్ తో నిధులు మంజూరు చేస్తారన్నారు. ఇందులో రూ.6 కోట్లు శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నారన్నారు. మరో నాలుగు ఆలయాలను ధూప దీప నైవేధ్యం పథకం పరిధిలోకి తీసుకునేందుకు ముందుకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని తెలిపారు.
శుక్రవారం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు. కార్తీక మాసంలో ఆలయాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. చివరి కార్తీక సోమవారం సందర్భంగాను, కార్తీక మాసం ముగిసే రోజునా ఆలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండవచ్చనీ, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మహిళా భక్తులకు దర్శనాలు, పూజల దగ్గర ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిఠాపురం నియోజక వర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగా దేవాలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజంలో భాగంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో చర్చించి పిఠాపురం పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిధులు కోరాము. ప్రధాన ఆలయాలతో పాటు మొత్తం 19 ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని ప్రముఖ శక్తి పీఠం శ్రీ పురూహుతికా అమ్మవారి ఆలయం, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయాలకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నామన్నారు.
• మండపాల నిర్మాణం…
కోనేరు మరమ్మతులు శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సుమారు రూ.6 కోట్లు వెచ్చించి పిండ ప్రదాన మండపం, అన్నదాన మండప నిర్మాణంతోపాటు కోనేరు మరమ్మతులు చేపట్టేందుకు కామన్ గుడ్ ఫండ్ నుంచి ఇప్పటికే నిధులు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ ఆమోదం లభించింది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆలయం అభివృద్ధికి రూ.2 కోట్లు కామన్ గుడ్ ఫండ్ ద్వారా మ్యాచింగ్ గ్రాంట్ తో మంజూరు అయ్యింది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయిన శ్రీ పురూహుతికా అమ్మవారి ఆలయ అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేయిస్తున్నాం. పిఠాపురం శ్రీ సీతారామాంజనేయ ఆశ్రమం అభివృద్ధికి రూ.60 లక్షలు, శ్రీ జై గణేష్ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.65 లక్షలు, చిత్రాడలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 లక్షలు కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ అంగీకరించింది. వీటితోపాటు జీర్ణావస్థకు చేరిన పలు ఆలయాలను అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ ముందుకు వచ్చింది. పిఠాపురం మండలం నవ ఖండ్రవాడలోని శ్రీ నక్కుల్లమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ రామాలయం, గొల్లప్రోలు శ్రీ సిరితల్లి ఆలయం, తాటిపర్తిలోని శ్రీ మార్కండేయసహిత భద్రావతి భావనరుషి స్వామి వారి ఆలయాలను పవన్ కళ్యాణ్ చొరవతో ధూప దీప నైవేద్యం పథకం పరిధిలోకి తీసుకునేందుకు దేవాదాయ శాఖ అంగీకారం తెలిపింది. సనాతన ధర్మానికి ప్రతీకలుగా నిలిచే ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత.
ఆలయాల పరిరక్షణ, భద్రత, అభివృద్ధికి అధికారుల బాధ్యతల నిర్వహణతోపాటు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకం అన్నారు.
















Leave a Reply