Advertisement

ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన

– బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం

– 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

– మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక

విశాఖపట్నం, సింహగర్జన, ప్రతినిధి, నవంబర్ 13 : ఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం నవంబర్ 17న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వేగంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *