విక్టరీ వెంకట్ రెడ్డి అందజేసిన రూ.20 లక్షల విలువైన బ్యాటరీ కార్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
వాడపల్లి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త విక్టరీ బజార్స్ అధినేత గొలుగూరి వెంకట్ రెడ్డి అందజేసిన రూ.20లక్షల విలువైన బ్యాటరీ కార్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ట్రయల్ రన్ లో పాల్గొన్నారు. దివ్యాంగులకు, వృద్ధులకు ఉపయోగపడే బ్యాటరీ కార్లను అందించిన విక్టరీ బజార్స్ అధినేత గొలుగూరి వెంకటరెడ్డిని ఆయన అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో ప్రధాని మోడీ సహకారంతో ఆలయ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రసాద్ స్కీమ్ లో రూ.96 కోట్ల నిధుల కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానిక పంపడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, దేవాదాయశాఖ, రుడా, ఓఎన్జీసీ నిధుల ద్వారా ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. రూ.12కోట్లతో శ్రీనివాసం పేరుతో రూములు, డార్మిటరీల నిర్మాణం జరుగుతుందన్నారు. వాడపల్లి నుంచి రావులపాలెం వరకు ఏటిగట్టు రహదారి నిర్మాణం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ.6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. సంక్రాంతికి వాడపల్లిలో సంక్రాంతి సంబరాలు, గోదాదేవి కల్యాణం నిర్వహించనున్నామని తెలిపారు. లొల్ల లాకులను అభివృద్ధి చేసి నేషనల్ లెవెల్ బోట్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని తెలిపారు. స్వామివారి అనుగ్రహంతో వాడపల్లిని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఆలయ అభివృద్ధికి ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు కృషి చేస్తున్నారని తెలిపారు. దాతలు ముందుకు వస్తున్నారన్నారు. గత ఆరు నెలలుగా విక్టరీ బజార్స్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ గా ఒక ఉచిత బస్సు నడుపుతున్నారని, ఒక్కో బ్యాటరీ వాహనంలో 14 మంది ప్రయాణించేలా, రెండు బ్యాటరీ వాహనాలు అందజేశారని తెలిపారు. భవిష్యత్తులో సైతం మరింత సహకారం అందిస్తామని వారు తెలిపారని, వారికి వ్యాపార అభివృద్ధి జరగాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో కాయల జగన్నాధం, ముళ్ళపూడి భాస్కరరావు, పాలూరి సత్యానందం, తోట రజిని, ఏపుగంటి రాజు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















Leave a Reply