Advertisement

టిడ్కో ప్లాట్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్

అనుమానితుల కోసం తనిఖీలు

25 వాహనాలు స్వాధీనం – మూడున్నర గంటల పాటు సోదాలు

మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలిన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రామచంద్రపురం డిఎస్పి రఘువీర్ నేతృత్వంలో మండపేట టిడ్కో ప్లాట్లలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 8:30 వరకు సోదాలు చేశారు. మండపేట టౌన్, రూరల్,  రామచంద్రపురం సీఐలు డీ.సురేష్, పీ.దొరరాజు, వెంకట నారాయణలు, రాయవరం ఎస్ఐ సురేష్, పామర్రు ఎస్ఐ జానీ బాషా, రూరల్ ఎస్సై వీ.కిషోర్, అంగర ఎస్ఐ హరీష్ కుమార్ లు సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతీ ప్లాటుకు వెళ్లి స్థానికులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనుమానితులను ఆరా తీశారు. సరైన రికార్డులు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టిడ్కో ప్లాట్లలో దాదాపు మూడున్నర గంటల పాటు కార్డెన్ సెర్చ్ జరిగింది. అటు కాలనీకి వచ్చే దారులన్నీ మూసేసి జల్లెడ పట్టారు. అనంతరం రఘువీర్ మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి కార్డెన్ సెర్చ్ లు నిర్వహిస్తామన్నారు. మండపేట టిడ్కో ప్లాట్లలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు పాల్గొన్నట్టు తెలిపారు. టౌన్ సీఐ డీ.సురేష్ ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించామని పేర్కొన్నారు. అక్రమ మద్యం, గంజాయి, చోరీ వాహనాలు, నగదు బంగారం వంటి ఇతర చోరీ వస్తువులు ఏమైనా ఉంటే వాటిని పట్టుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు ప్లాట్లను వినియోగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులను కూడా విచారించడం జరిగిందన్నారు. కాలనీలోని ప్రతి ప్లాటులోకి వెళ్లి స్థానికులను వివరాలతో పాటు ఇళ్లల్లో అద్దెకు ఉంటున్న వారి వివరాలను కూడా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ప్లాట్లను అద్దెకిచ్చేటప్పుడు వారి పూర్తి వివరాలు ఇంటి యజమాని దగ్గర తప్పనిసరిగా ఉండాలన్నారు. లేదంటే ఏదైనా అసాంఘిక పనులకు ఈ ప్లాట్లను వాడుకున్నట్టు తెలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అద్దెకు ఉంటున్నారు తప్పుడు పనులకు పాల్పడినట్టైంతే వారితో పాటు ఇంటి యజమానిని కూడా బాధ్యులుగా చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మొత్తం 76 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు. 13 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. 1,632 ఇళ్లలో తనిఖీలు చేపట్టామన్నారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి ఉదయం 8:30 వరకు నిర్వహించిన తనిఖీల్లో 25 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు వివరించారు. ఈ వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని, వాహన రికార్డులు సక్రమంగా ఉంటే తిరిగిచేస్తామని, లేదంటే కేసులు నమోదు చేసి అసలు యజమానికి వాహనం అప్పగించడం జరుగుతుందన్నారు. నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినట్లయితే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండపేట టౌన్ రూరల్, రాయవరం, పామర్రు, రామచంద్రపురం స్టేషన్ల పరిధిలోని పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *