- ప్రాచీన భారతీయ విద్యా సంస్థ ఏకదంత
- పుస్తకం కొనలేని రోజులు… ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకుని చదివి తిరిగి ఇచ్చేవాడిని.
యాదాద్రి భువనగిరి, సింహగర్జన ప్రతినిధి , నవంబర్ 18 : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆధ్యాత్మిక విద్య మరియు సంస్కృత ప్రాచీన విద్యా పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న ఏకదంత – ద స్కూల్ ఆఫ్ ఇన్సెంట్ ఇండియన్ స్టడీస్ సభ్యుల బృందము పద్మశ్రీ ఆచార్య కూరెళ్ళ విఠలాచార్యని మర్యాదపూర్వకంగా సందర్శించింది.
ఈ సందర్భంగా ఆచార్య తన జీవనయానం, గ్రంథాలయ సేవ, విద్యా త్యాగం గురించి పంచుకున్న అనుభవాలు అందరినీ లోతుగా ప్రభావితం చేశాయి. తన స్వంత ఇంటినే ప్రజలకు అందుబాటులో ఉండే గ్రంథాలయంగా మార్చి జ్ఞానసేవకు జీవితాన్ని అంకితం చేసిన విఠలాచార్య బాల్యంలోని కష్టాలను తేటతెల్లంగా గుర్తుచేసుకున్నారు. “పుస్తకం కొనలేని రోజులు… ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకుని చదివి తిరిగి ఇచ్చేవాడిని,” అన్న ఆయన మాటలు అక్కడున్న వారిలో గౌరవభావాన్ని కలిగించాయి.
1954లో సుమారు 500 పుస్తకాలతో తొలి గ్రంథాలయాన్ని స్థాపించి, అప్పటి దొరగారితో ప్రారంభం చేయించడం ఆ రోజుల్లో ఒక అసాధారణమైన సంఘటన అని ఆయన వివరించారు. “ఎవరో మహాత్ములు నాకు అన్నం పెట్టారు. ఆ అన్నమే నన్ను అక్షరజ్ఞానానికి చేర్చింది. నేను రాసిన శతకంలో వారి పేరును ముందు పెట్టుకోవడం నా కృతజ్ఞత” అని ఆయన హృదయపూర్వకంగా తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కి బాత్ కార్యక్రమంలో ఆచార్య కూరెళ్ళ విఠలాచార్య సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం గుర్తుచేసుకోవాల్సిందే. గ్రామీణ ప్రాంతంలోనూ ప్రజలకు జ్ఞానం అందించేందుకు తమ జీవితాన్ని సమర్పించిన మహనీయునిగా ఆయనను అభివర్ణించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయన నిరంతర సేవకు గౌరవార్ధం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించి సత్కరించింది.
ఈ సందర్శనలో ఏకదంత వ్యవస్థాపకుడు మరియు దర్శకులు యం.వి.సతీష్ కుమార్, ప్రధాన ఆచార్య చింతకింది సద్గుణ, నండూరు ఆంజనేయప్రసాద్, నండూరు భార్గవి, చిరంజీవి నండూరు క్రియ పాల్గొన్నారు. ప్రాచీన జ్ఞాన పరిరక్షణ కోసం కఠినంగా కృషి చేస్తున్న ఈ యువ బృందాన్ని చూసి ఆచార్య ఆనందం వ్యక్తం చేసి అందరిని సత్కరించారు. ప్రాచీన భారతీయ విద్యా పరంపరను భవిష్యత్తు తరాలకు చేరవేసే ప్రయత్నాల్లో ఈ సందర్శనం మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని ఏకదంత వ్యవస్థాపకుడు మరియు దర్శకులు యం.వి.సతీష్ కుమార్ తెలియజేశారు.
















Leave a Reply