విజయవాడ, సింహగర్జన సంపాదకుడు డా సునీల్ కుమార్ యాండ్ర, నవంబర్ 12 : ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలతో నడిచే వ్యవస్థ. అయితే ఈ వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రజలకు సరైన అవగాహన, బాధ్యత, నైతికత ఉండాలి. ఈ లక్షణాలను మనలో పెంచేది ఒక్క విద్యే మాత్రమే. విద్య మనిషిని చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్తుంది. అది కేవలం చదవడం, రాయడం నేర్పడమే కాదు, మన హక్కులు, విధులు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను అర్థం చేసుకోవడానికి మార్గం చూపుతుంది. అజ్ఞానం ఉన్నచోట ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది, కానీ విద్య ఉన్నచోట సహనం, గౌరవం, ఐక్యత పెరుగుతాయి. ఇస్లాంలో కూడా జ్ఞానాన్ని వెలుగు అజ్ఞానాన్ని చీకటిగా పేర్కొంది. అంటే సమాజంలో శాంతి, సామరస్యాన్ని స్థాపించేది జ్ఞానం అని అర్థం. మనం పొందే విద్య మతం, భాష, వర్గం అనే భేదాలను తొలగించి మనిషి మనిషిగా గౌరవించడాన్ని నేర్పాలి. భారతదేశం అనేక మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశం. ఈ వైవిధ్యమే మన బలం. కానీ ఈ బలం నిలబెట్టుకోవాలంటే మన మాటలు, పనులు ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలి. మతం లేదా వర్గం పేరుతో కలహాలు రేపితే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని నష్టం కలుగుతుంది. ప్రజాస్వామ్య బలం విద్యా ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం విద్యా రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మంచి విద్యతోనే దేశ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. నేటి పరిస్థితుల్లో ముస్లిం సమాజం సహా అనేక వర్గాల్లో విద్యా స్థాయి ఇంకా వెనుకబడి ఉందని అనేక అధ్యయనాలు తేటతెల్లం చేసింది. మన చరిత్ర చూస్తే, ఒకప్పుడు మన విద్యా సంపద ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అప్పుడు మన పండితులు, శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి మార్గదర్శకులయ్యారు. కానీ ఇప్పుడు మనం ఆ గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకోసం ఆధునిక విద్యతో పాటు నైతిక విలువలు, ఆధ్యాత్మికత కలిసిన పాఠ్య విధానం ఎంతైనా అవసరం. ఇప్పట్లో విద్యను ఉద్యోగం లేదా డబ్బు సంపాదించే సాధనంగా మాత్రమే చూడటం చాలా విచారకరం. విద్య లక్ష్యం లాభం కాదు సేవ, స్వభావ నిర్మాణం, సమాజ అభివృద్ధి కావాలి. విద్యతో పాటు శిక్షణ (తర్బియా), నైతిక అభివృద్ధి (తజ్కియా) కూడా అంతే ముఖ్యమని ఇస్లామిక్ పండిత నిపుణులు చెబుతున్నారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ జీవితం ఈ విషయంలో మనకు గొప్ప ప్రేరణ కలిగిస్తుంది. ఆయన ముస్లిం సమాజాన్ని విద్యతో ముందుకు తీసుకువెళ్లేందుకు జీవితాన్ని అంకితం చేశారు. ఆయన దూర దృష్టి ఫలితంగా ఏర్పడిన అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఇప్పటికీ జ్ఞాన కాంతిగా ప్రకాశిస్తోంది. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. విద్య మనలో అవగాహన, సహనం, గౌరవం పెంపొందిస్తుంది. చదువుకున్న పౌరుడు తన హక్కులు, బాధ్యతలను అర్థం చేసుకుంటాడు. అజ్ఞానం అసహనాన్ని పెంచుతుంది. విద్య మాత్రం ఆలోచించే శక్తి, వాదించే స్వేచ్ఛ, పరస్పర గౌరవాన్ని నేర్పుతుంది. ఇవే ప్రజాస్వామ్యం యొక్క అసలైన స్ఫూర్తి. విద్యా వ్యవస్థ నైతికతతో కూడినదిగా, సమాజ సేవకు దోహదపడేదిగా ఉండాలి. విద్య ద్వారా మాత్రమే మనం న్యాయం, సమానత్వం, స్వేచ్ఛను కాపాడగలము. ప్రజలందరికీ సమానంగా విద్య అందినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుంది. ముగింపుగా చెప్పాలంటే విద్య ప్రజాస్వామ్యానికి పునాది, స్ఫూర్తి, మనుగడకు హామీ. చదువుకున్న, అవగాహన కలిగిన, బాధ్యతగల పౌరులు ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం జీవిస్తుంది. విద్య మనిషిని మారుస్తుంది, సమాజాన్ని తీర్చిదిద్దుతుంది, దేశాన్ని బలపరుస్తుంది. విద్య ఉన్నచోట వెలుగు, ప్రజాస్వామ్యం ఉన్నచోట సమానత్వం. ఈ రెండూ కలిసినప్పుడే మన దేశం నిజమైన ప్రజాస్వామ్య రాజ్యంగా రాజ్యమేలుతోంది.
ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో, విద్య కీలక పాత్ర పోషిస్తుంది
















Leave a Reply