Advertisement

వేదిక నుండి – వెండి తెరకు నటుడుఅక్కినేని నాగేశ్వరరావు

మహోన్నత నటుడుఅక్కినేని నాగేశ్వరరావు (1924, సెప్టెంబరు 20 – 2014, జనవరి 22) తెలుగు నటుడు, నిర్మాత. ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. సుమారు 255 చిత్రాల్లో నటించాడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల తెలుగు, తమి‌ళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించాడు. ఎన్.టీ.ఆర్ తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు. మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినీరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు. ఎన్టీ రామారావుతో కలిసి 14 సినిమాల్లో నటించాడు. దాసరి నారాయణరావు ఎన్.టి.రామారావు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళని వ్యాఖ్యానించాడు. ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు సినిమాలో అరుదైన నటుడిగా గుర్తింపు పొందాడు. వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు. అయినా ఎన్నో భక్తి సినిమాలలో నటించాడు. అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. కొడుకు నాగార్జున, మనవడూ నాగచైతన్యతో కలిసి నటించిన మనం సినిమా ఆయన నటించిన చివరి చిత్రం. అక్కినేని 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపు విడుదల చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించింది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు, అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశాడు. అన్నపూర్ణ 2011 డిసెంబరు 28 న మరణించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *