శేషాచలం, వెలిగొండ అటవీ విస్తీర్ణం ఎంత?
ఎర్రచందనం సంరక్షణకు తీసుకుంటున్న చర్యలేంటి?
ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లు ఏంటి?
మామండూరు అటవీ ప్రాంత సందర్శనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా
వాచ్ టవర్ నుంచి అటవీ ప్రాంతం పరిశీలన
అటవీ సరిహద్దులు, ఏనుగుల సంచార ప్రాంతాల వీక్షణ
టాస్క్ ఫోర్స్ ఆపరేషన్స్ అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి
కాలి నడకన అటవీ ప్రాంతంలో తిరుగుతూ ప్రతి మొక్కనూ ఆసక్తిగా పరిశీలించిన పవన్ కళ్యాణ్
అంకుడు మొక్కలు విరివిగా పెంచాలని సూచన
తిరుపతి, సింహగర్జన సంపాదకుడు డా సునీల్ కుమార్ యాండ్ర, నవంబర్ 08 : శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందన సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంకుడు చెట్లు విరివిగా పెంచి కొండపల్లి బొమ్మల కళాకారులకు చేయూత ఇవ్వాలని సూచించారు. శనివారం ఉదయం తిరుపతి జిల్లా, శేషాచలం పరిధిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఐదు కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణం చేశారు. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన తిరిగి అడవిని అణువణువు పరికించి చూశారు. శేషాచలం అటవీ ప్రాంతంలో అసలు ఏం జరుగుతోంది? ఎర్ర చందనం ఎంత విస్తీర్ణంలో ఉంది? ఎర్ర చందనాన్ని సంరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలేంటి? నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన వృక్ష జాతులేంటి? వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
• వాచ్ టవర్ నుంచి అడవి మొత్తం పరికించి చూసి..
మార్గం మధ్యలో నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ ఎక్కారు. బైనాక్యూలర్ లో అడవి మొత్తం పరికించి చూశారు. ఎర్ర చందనం మొక్కలు ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? శేషాచలం అడవి సరిహద్దులు, వెలిగొండ అటవీ సరిహద్దులను అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాచ్ టవర్ నుంచి గుంటి మడుగు వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది.? ఎటు వైపు ప్రయాణిస్తుంది? తదితర వివరాలు ఆరా తీశారు. ఎర్ర చందనం వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని రక్షించేందుకు గతంలో మాదిరి కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
• స్మగ్లర్లు నరికాక మొదళ్ల నుంచి చిగుర్లు
వాచ్ టవర్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలి నడకన అడవిలో ప్రయాణం చేశారు. ఎర్ర చందనం మొక్కలతో పాటు ఎర్రచందనం మాదిరి కనిపించే బిల్లుడు వృక్షాలను ఆసక్తిగా తిలకించారు. మార్గం మధ్యలో అంకుడు చెట్లను అటవీ అధికారులు పవన్ కళ్యాణ్ కి చూపించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే అంకుడు చెట్లు 20 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయని తెలిపారు. అంకుడు చెట్లు పెరిగేందుకు అనూకూల వాతావరణ పరిస్థితులు శేషాచలంలో ఉండే వాటిని విరివిగా పెంచి కొండపల్లి బొమ్మల కళాకారులకు సరఫరా చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు. నరికి ఉన్న ఎర్రచందనం చెట్ల వేళ్లను పరిశీలించారు. ఆ చెట్లు చాలా ఏళ్ల క్రితం స్మగ్లర్లు నరికినవని, వేర్లతో సహా పెకిలించకపోవడం వల్ల తిరిగి జీవం పోసుకున్నాయని అటవీ అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. ఎర్రచందనం మొక్కలకు సహజ సిద్ధమైన రక్షణ కల్పించేందుకు అటవీశాఖ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
• అడవుల్లోకి స్మగ్లర్లు ఎలా వస్తారు? ఎటు నుంచి వస్తారు?
శేషాచలం అడవుల్లోకి స్మగ్లర్లు ఎటు వైపు నుంచి ఎక్కువగా వస్తారు? తమిళనాడు వైపు నుంచి వచ్చే స్మగ్లర్లు ఏ వైపు నుంచి ఎక్కువగా అడవిలో ప్రవేసిస్తూ ఉంటారు. వారిని పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. వారి నుంచి అటవీ శాఖ అధికారులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు? చందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? టాస్క్ ఫోర్స్ కూంబింగ్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి. తదితర అంశాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
• ఏనుగుల సంచారంపై ఆరా
మామండూరు అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచరించే ప్రాంతాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. వాచ్ టవర్ నుంచి పరిశీలించడంతో పాటు శేషాచలం, వెలిగొండ, నల్లమల అడవుల మ్యాప్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుమల, భాకరాపేట, కళ్యాణి డ్యాం తదితర ప్రాంతాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయని అధికారులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీలో జీవ వైవిధ్యం తదితర అంశాలపై అధ్యయనం చేశారు.
• గుంటి మడుగు వాగు వద్ద ప్రకృతి అందాలను ఆస్వాదించిన పవన్ కళ్యాణ్
మార్గమధ్యంలో గుంటి మడుగు వాగులో పవన్ కళ్యాణ్ దిగారు. నీటి స్వచ్ఛతను, పరిసరాల్లో ఉన్న అరుదైన వృక్ష సంపదతో కూడిన ప్రకృతి అందాలను పరికించారు. వాగు వద్ద కాసేపు సేద తీరారు. ఆ ప్రాంతంలో కనిపించే మెల్లం వెదురు బొంగుల ప్రత్యేకతలు తెలుసుకున్నారు. తిరుగు ప్రయాణంలో మామండూరు క్యాంప్ వద్ద సైకస్ మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు, తిరుమల అటవీ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ సెల్వం, డి.ఎఫ్.ఒ. రవిశంకర్ శర్మ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













Leave a Reply