Advertisement

తణుకు పురుషుల శాఖా గ్రంథాలయంలో ఇందిరా గాంధీకి ఘనమైన నివాళి

తణుకు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 19 : భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి “భారత ఉక్కు మహిళ”గా ప్రసిద్ధి చెందిన భారత మాజీ ప్రధాని “భారత రత్న ఇందిరా గాంధీ నిరంతరం శ్రమించారనీ, మహిళా సాధికారతకు విశేష కృషి చేసారని ప్రభుత్వ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సంకు మనోరమ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం స్థానిక పురుషుల శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సంలో సంకు మనోరమ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సంకు మనోరమ చందమామ కథల పుస్తకాన్ని లైబ్రరీకి బహూకరించారు. తొలుత సభకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.

సభకు మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సభావేదికను స్థానిక శ్రీ మారుతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్. పద్మజ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యురాలు మునుకుట్ల ఉమాజ్యోతి, ప్రముఖ కవయిత్రి జవ్వాది లక్ష్మి, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు ప్రభృతులు అలంకరించారు. ముందుగా ఇందిరా గాంధీ చిత్ర పటానికి సంకు మనోరమ పుష్పమాల అలంకరించగా, సభా వేదికను అలంకరించిన ఆహ్వానితులు, సభాసదులు ఇందిరా గాంధీ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ మాట్లాడుతూ తాను ఇందిరా గాంధీని 1977 మార్చి నెలలో జరిగిన సాధారణ ఎన్నికల ప్రచార సమయంలో నెల్లూరు జిల్లా కావలి వచ్చిన సందర్భంలో చూసాననీ, ఆనాడు వారు బహిరంగ సభలో అద్భుతంగా హిందీలో ప్రసంగించారని చెప్పారు.

శ్రీ మారుతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్.పద్మజ మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశ భక్తి కలిగిన పరిపాలనాదక్షురాలని ప్రశంసించారు. రిటైర్డ్ తెలుగు పండితులు వాడపల్లి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశలో విద్యార్థులు శ్రద్ధగా విద్యను అభ్యసించాలని హితవు పలికారు. ప్రముఖ కవయిత్రి జవ్వాది లక్ష్మి, సినీ గేయ రచయిత పప్పొప్పు విజయలక్ష్మి, పీయంపీ డాక్టర్ ఎస్.శ్రీనివాస్, వారి కుమార్తె చి.ఎస్.శ్రావణి తమ పాటలతో సభను అలరించారు. సభలో పప్పొపు విజయలక్ష్మి ఒక వంద పుస్తకములు గ్రంథాలయానికి బహూకరించారు. రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం విద్యార్థులకు పెన్నులు బహూకరించారు. సభలో చివరిగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ తరపున సంకు మనోరమను చీకటి శ్రీనివాసరావు, మునుకుట్ల ఉమాజ్యోతి, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు ప్రభృతులు దుశ్శాలువాతో సత్కరించారు.

ఈ సభలో ఇంకా రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, ప్రముఖ కవి వి.ఎస్.వి.ప్రసాద్, రిటైర్డ్ ఉపాధ్యాయులు మహమ్మద్ స్వాలీహా, గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ రాగాల పృథ్వీ నారాయణ, యన్.కృష్ణానందం, భాస్కర్ల శ్రీపద్మ ప్రియ, బి.మణి, సీహెచ్.శ్రీను ప్రభృతులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు దేశభక్తి గేయం పోటీలు నిర్వహించారు. మునుకుట్ల ఉమాజ్యోతి వందన సమర్పణతో నాటి సభ ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *