అగ్నిపూలు
అగ్నిపూలు పూచాయి ఎదలోతుల్లో
అద్వైతం అక్షువులకు సంయుక్తమైన క్షణాన
కనులను కమ్మేసిన అడ్డుతెరలు
ఒక్కొక్కటి వీడిపోతున్నాయి…
వికసించిన నా హృదయము
ఈశ్వరుని చూసి ఉప్పొంగిన క్షణాన
ఉషస్సులన్నీ విజృంభించి నాపై దండయాత్రకు దిగాయి
దైనందిన జీవితపు అడ్డు రేఖలు అశ్రువులు చీల్చుకుని మరీ
అంధకార బాణాలు నాపై విసిరిన క్షణాన
ఆగాలని లేదు నా ఆశకు
ఆపాలని లేదు ఈ శ్వాసను
ఆరాధన అనే ఆలోచనే లేదు
ఆగక సాగాలని రుధిరం పరవళ్ళు తొక్కుతుంది
ఆవేశాన్ని అణువణువు నింపుకుని కదులుతున్నా
ఇతరుల దృక్కోణమేదైనా
నే నడిచే తోవలో ఎదురయ్యే
అడ్డు గోడలను కూకటి వేళ్లతో పెకిలించాల్సింది నేనే
పరిణితి పెంచుకొని ప్రత్యామ్నాయలను జయించాల్సింది నేనే
ఉప్పొంగే గంగనై విజృంభించి విళయ తాండవం చేయాల్సిందే నేనే
రాక్షసమూఖ రేపే పుకార్లను ధీరత్వంతో వధించాల్సింది నేనే…
రచన : పోలగాని భాను తేజశ్రీ













Leave a Reply