Advertisement

వృద్ధాప్యమా

ఎంతటి అందమైన యవ్వనమైన ఏదో ఒక రోజు ముడుచుకుపోక తప్పదు ఎంతటి వీరత్వం అయినా ఏదో ఒక రోజు నిస్సహాయంగా నిలబడక తప్పదు ఎంతటి తెలివితేటలు అయినా ఆఖరి మజిలీలో ఆరడుగులు చేరక తప్పదు ఏది మిగలదు ఏది శాశ్వతం కాదు ఒంటరి ఈ ప్రయాణంలో ఒంటరితనమే కడదాకా తోడుగా ఉండేది…

ఒక మనిషి తనలో తాను పడుతున్న సంఘర్షణలకు, వెతుకుతున్న పరమార్థాలకు, దక్కించుకోలేకపోయినా కొన్ని పరిస్థితులకు, శాశ్వతంగా వదులుకోవలసిన కొన్ని జ్ఞాపకాలకు, అడ్డుతెరలు కప్పుతూ ఉంటాడు, అమాంతం అన్నిటిని ఒక్కోసారి వదిలేస్తూ ఉంటాడు, ఈ జీవిత పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులను దాటుకుని, జీవిత పరమార్ధాన్ని తెలుసుకున్న నాడు, ఏది తనది కాదని అర్థమవుతుంది, ఏదో ఒక రోజు తనది కావాలని ఆశ పుడుతుంది.

ఈ రచయిత అక్షరాలు, అక్షరాలు మాత్రమే కాదు వాస్తవాన్ని కనులకు సాక్షాత్కరించే గొప్ప జీవిత పాఠాలు, మనసుపెట్టి అర్థం చేసుకుంటే మమతానురాగాలు, ఆలోచనలతో మెడలు కట్టగలం కానీ, కాసులు లేనిదే అడుగు ముందుకు కదపలేము, కదా అలాంటి అర్థవంతమైన నిజాలను చూపించడంలో ఈ రచయిత బిడ్డ అనడంలో అతిశయోక్తి లేదు…

  • ఇక కవిత్వం విషయానికి వస్తే…
  • శీర్షిక : ఇది చివరి మజిలీ

ఎన్ని కష్టాలో కదా…

ఈ చివరి మజిలీ దాకా!

ఎన్ని అవమానాలో కదా

ఈ వృద్దాప్య జీవనంలో!

ఎన్నో ప్రయాణాలలో…

ఎన్నో ఒడిదుడుకులలో…

ఎంతో అలసిపోతారు!!

అలవికాని ఆలోచనలతో క్రుంగిపోతారు…

జీవితంలో నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు!..

ఆఖరి మజిలీలో అంధకారం చుట్టేస్తుంది!…

ఆఖరిదశలో కాంతిలేనికళ్ళు

ఓ పలుకరింపుకోసం…మనశ్శాంతి కొరకు… ఎదురుచూస్తుంటాయి!..

ఓ ఆప్యాయత స్పర్శకోసం…

ఓ ఆత్మీయ మాటకోసం…

మనసు పరితపిస్తుంది!…

పండుటాకులై కదలలేని స్థితిలో కాలం వెళ్లదీస్తుంటారు!..

గడిచిన జ్ఞాపకాలను తవ్వుకుంటూ….

ముడుచుకున్న ముడుగులకు ప్రేరణయిస్తూ…

అంతిమంగా సమాజ చౌరస్తాలో నిలిచిపోతారు!!…

తొలిమెట్టు నుండి చివరిమెట్టు దాకా జీవితాన్ని వల్లె వేస్తుంటారు!…

పేగుతెంచుకున్న బంధాలు…రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోతారు…

ప్రేమను..పేగు బంధాలను తుంచేసుకొని వెళ్లిపోతారు!!…

ఇప్పుడు నిస్సత్తువతోయమయాతన పడుతుంటారు..

తెలియని హావభావాలతో…మెదడులో ప్రేరణ సంకేతాలు అందక…

ఏదో అంతరాయంతో అవధులు దాటలేక…

మనసులోని భావాల్ని బయటపెట్టలేక…

గాఢాంధకారంలో ముడుచుకు పోతున్నారు!..

ఇప్పుడు వీరు రెక్కలు విరిగిన పక్షుల్లా…

ఒంటరిగా మిగిలిపోతారు!…

ముసిరిన ముసలితనంచుట్టేస్తుంది…

అవయవాలను పట్టి కట్టేస్తుంది…

కదలలేని స్థితిలోఉన్నవారికి ఇపుడు దిక్కువృద్దాశ్రమమే!…

వారిని అక్కున చేర్చుకుంటుంది…చేరదీసి చేయూతనిస్తుంది!…

దయ…కనికరం ఉన్నోళ్లు చేరదీస్తారు…

జీవితంలో ప్రతిఒక్కరి చివరిమజిలీ ఇదే… ఇలానే సాగుతోంది!!…

ఆలోచించండి… అందరి పరిస్థితి ఇంతే!…

  • రచయిత : అంబటి నారాయణ
  • సమీక్ష

చివరి మజిలీ చేరేదాకా ఎన్ని కష్టాలను, ఎన్ని అవమానాలను ఎదుర్కోవాలో కదా, వృద్ధాప్యం ఒంటిమీద పడిన క్షణం నుంచి ఎన్ని ఛీత్కారాలు, ఎన్ని ఒడిదుడుకుల ప్రయాణాలు, అలసట తప్ప ఆఖరికి మిగిలేదేదీ ఉండదు కదా…!! అంటూ వృద్ధాప్య జీవితం గురించి వివరంగా వర్ణించారు రచయిత.

జీవితంలో నిరంతరం చేసే పోరాటం ఆఖరి మజిలీలో అంధకారంగా కమ్మేస్తుంది, ఆఖరి దశలో కాంతి చెమ్మగిల్లి ఆ కళ్ళు ఒక్క పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి… అంటూ నిజజీవిత సంఘటనలను అర్థవంతంగా వివరించారు.

ఓ ఆత్మీయ మాట కోసం, ఆప్యాయత స్పర్శ కోసం మనసు పరితపిస్తూ ఉంటుంది, పండుటాకు మల్లె కదలలేని స్థితిలో కాలం వెల్లదీసే వయసులో, గడిచిన జ్ఞాపకాలను తవ్వుకుంటూ, తొలిమెట్టు నుండి చివరి మెట్టు దాకా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు.

పేగు తెంచుకున్న బంధాలు, రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిపోతే, నిస్సత్తువతో యాతన పడుతూ, తెలియని హావభావాలతో మెదడుకి ప్రేరణ సంకేతాలు అందక, ఎదురయ్యే అవధులు దాటలేక మనసులోని భావాలను బయట పెట్టలేక గాఢాంధకారంలో ముడుచుకుపోతున్నాయి ఆ ముసలి మనసులు, అంటూ విరిగిన ఆ హృదయ వేదనను ఆవేదనతో అక్షరాల రూపాన్ని ఇచ్చి వర్ణించారు.

ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షుల ఒంటరిగా మిగిలిపోయారు., మురిసిన ముసలితనం చుట్టేసింది అవయవాలు పట్టి కట్టేసింది, కదలలేని స్థితిలో ఉన్న వారికి దిక్కు వృద్ధాశ్రమమే కదా..!

వారిని అక్కున చేర్చుకుని చేరదీసి చేయూతనిస్తుంది, దయా కనికరం ఉన్నోళ్లే కదా చేరదీస్తారు, జీవితంలో ప్రతి ఒక్కరి చివరి మజిలీ ఇదేనేమో… అంటూ జీవితాన్ని కాచి వడబోసిన ఎంత మేధావులు అయినా ఆఖరికి ముసలితనాన్ని చేరక తప్పదు, ఆ క్షణాన ఎదురయ్యే అవాంతరాలను ఎదుర్కోక తప్పదు…

హడావుడి బ్రతుకులలో పడి, కన్న పేగులను మరుస్తున్నారు బిడ్డలు, తిన్నావా అని అడిగే పిలుపు లేక అల్లాడిపోతున్నారు ముసలి తల్లిదండ్రులు, శాంతి కోసం పరితపించే ఆ వృద్ధులకు చేయూతనిచ్చే రక్తసంబంధం ఆఖరి మజిలీలో అయినా నిలబడుతుందా…!?

మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, అవసరానికి మించిన ఆదాయం అవసరం లేదని వాస్తవాన్ని గ్రహించి మసులుకోవాలి, మనకు ప్రాణం ఇచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న ఇంగితాన్ని తెలుసుకోవాలి, కండలు పెంచి, కట్టలు సంపాదిస్తే సరిపోదు, ప్రాణం పోసిన వారికి ప్రాణవాయువులా అంటిపెట్టుకుని ఉంటేనే ఆ అనురాగ, ఆప్యాయతలు మన చివరి దశలో మన బిడ్డల నుంచి దక్కుతాయి, లేకుంటే మన వృద్ధాప్యంలో మనకు కూడా వృద్ధాశ్రమమే ఆఖరి మజిలీగా మారుతుంది… ఆలోచించుకో ఒకసారి, నువ్విచ్చిందే నీకు వస్తుంది కదా…

అద్భుతమైన వాస్తవాన్ని, మరుస్తున్న మరో నిజాన్ని, మరొకసారి గుర్తు చేశారు, మనల్ని మనం ప్రశ్నించుకుంటేనే సమాధానం దొరుకుతుందని చెప్పకనే చెప్పారు, పాఠకుల మనసును ఆలోచింపజేసే విధంగా మీ అక్షరాల ఒరవడి అద్భుతంగా ఉంది, ఇలాంటి మరెన్నో కవనాలు లిఖించి ఈ సాహితీ పిపాసులకు, పాఠక ప్రియులను మీ రచనలతో ఉత్తేజ పరుస్తూ, మార్గ నిర్దేశం చేస్తూ,చేయూతనిస్తూ, సాహితి ప్రపంచంలో మీ రచనలు మునుముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • సమీక్ష : పోలగాని భాను తేజశ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *