Advertisement

ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, జూన్ 29 : “రైతే దేశానికి వెన్నెముక”, “ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలి”, “రైతు రాజుగా బ్రతకాల”ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. పిఠాపురం స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో సోమవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు. అనంతరం నిర్వహించిన సస్యవృద్ధి బీజారోపణ మహోత్సవంలో అధ్యక్షత వహించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు రైతు సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజున భారతీయ సంస్కృతిని అనుసరించి గోమాతను పూజించి, వ్యవసాయాన్ని రైతు ప్రారంభించే ఆచార పద్ధతిని కొనసాగిస్తూ, పీఠం గత ఏడు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక వ్యవసాయం నిర్వహిస్తుందని అన్నారు. ప్రతి రైతు ప్రకృతిని పరిరక్షించే విధంగా ఆరోగ్యకరమైన రీతిలో ఆధునిక సాధనాలను, ఉపకరణాలను ఉపయోగించుకుని, సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే మంచి ఉత్పత్తులు సాధించవచ్చు అని తెలిపారు. రసాయనాలు కలిపిన ఎరువులను వాడడం ద్వారా భూసారం దెబ్బతిని, క్యాన్సర్ వంటి రోగాలు వ్యాపిస్తున్నాయని అన్నారు. సేంద్రియ ఎరువును తయారు చేసుకుని, ఆధ్యాత్మిక భావనతో వ్యవసాయం చేసినట్లయితే, ఆరోగ్యకరమైన ఉత్పత్తుల ద్వారా ఆయుష్షును పొంది, ఆనందంగా జీవించవచ్చని పిలుపునిచ్చారు.

ఎల్ నినో వంటి సంక్షోభాలు ఎదురైనా సద్గురు దివ్య బీజాలతో ఆధ్యాత్మిక వ్యవసాయం చేయడం ద్వారా భగవంతుని కృప ప్రసరింపబడి, ఏవిధమైన నష్టాలు లేకుండా అభౌతిక శక్తిని రక్షణగా పొందవచ్చు అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో స్వామివారు ముఖ్య అతిథులతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం నిర్వహించిన సభలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విశిష్ట రైతులు రెడ్డి రాంబాబు (ముమ్మిడివరం), శెట్టిపల్లి బాబ్జి (సీతారామపురం), గాలి బేబి (చీమలవారిగూడెం), మలిరెడ్డి వెంకటేశ్వరరావు (సోమవరం), పైల సత్యనారాయణ (పోలవరం) వారిని ఘనంగా సత్కరించారు. తదుపరి పరబ్రహ్మ మొహియద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం 2026 పురస్కారాన్ని నాగులాపల్లి ఉప్పరగూడెంకు చెందిన జక్కి శ్రీనివాసరావుకి అందజేసి పదివేల రూపాయల నగదు పురస్కారాన్ని, జ్ఞాపికను బహూకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యక్రమంలో విశిష్ట అతిథి రాజమహేంద్రవరం ఎంటమాలజీ కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి.హెచ్.నరసింహారావు మాట్లాడుతూ రైతు ఆర్థిక అభివృద్ధి సాధించడానికి తగిన సూచనలు చేశారు. మరొక విశిష్ట అతిథి పిఠాపురం హార్టికల్చర్ ఆఫీసర్ వై.సోమశేఖర రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రోత్సాహాలను రైతులు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. మరొక అతిథి నల్గొండ జిల్లా పోలేపల్లి నుండి ఇన్నోవేటివ్ ఆర్గానిక్ ఫార్మర్ మరియు ఎల్.పి.ఆర్.ఆర్గానిక్స్ సీఈవో లోకసాని పద్మా రెడ్డి మాట్లాడుతూ సేంద్రీయ ఉత్పత్తులతో ఆర్థిక అభివృద్ధి ఎలా సాధించాలో తెలియజేశారు.

పతంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రత్యామ్నాయంగా పంటల గురించి వివరించారు. మరొక అతిథి రాజమహేంద్రవరం ఆగ్రోమోమీ డిఏఏటిటిసి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ సమీకృత వ్యవసాయ విధానం గురించి తెలిపారు. మరొక అతిథి సంజీవి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సొసైటీ సెక్రటరీ, విశాఖపట్నం నుండి పచ్చారి దేవుళ్ళు మాట్లాడుతూ దేశీ విత్తనాల సంరక్షణ గురించి ప్రసంగించారు. అనంతరం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. నడింపల్లి రామగోపాల వర్మ, డ్రోన్లతో వ్యవసాయం, బహుముఖ ప్రయోజనాలు, డ్రోన్ పైలెట్ శిక్షణ గురించి రైతులకు వివరించారు. తదుపరి పీఠాధిపతుల సోదరులు, విశిష్ట అతిథి అహ్మద్ ఆలీషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ప్రతి రైతు బాధ్యత కావాలని పీఠం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. తదుపరి అతిథులను పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

తదుపరి విశిష్ట రైతులు, పురస్కార గ్రహీత, ముఖ్య అతిథులు పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులను ఘనంగా సత్కరించి పర్యావరణ పరిరక్షణ కొరకు పీఠాధిపతి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు ఏ.వి.వి.సత్యనారాయణ సభా వ్యాఖ్యానం చేయగా, ఎన్.టి.వి.ప్రసాద వర్మ వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, ప్రకృతి వ్యవసాయ పారిశ్రామిక వేత్త కెప్టెన్ మల్లిఖార్జున పాల్గొన్నారు మరియు వందలాదిగా రైతులు పాల్గొని, సద్గురు దివ్య బీజాలు పొంది, ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *